శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 19 జూన్ 2018 (15:50 IST)

గోరింటాకు ఎర్రగా పండాలా... ఈ చిట్కాలు పాటిస్తే...

మహిళల అలంకరణ ప్రాధాన్యతలో గోరింటాకు ప్రత్యేకమైన స్థానం. అట్లతద్ది వంటి పండుగలకు గోరింటాకు పెట్టుకోవడం తెలుగు నేల ఆనవాయితీ. చిన్న శుభకార్యం మెుదలు పండుగలు, పెళ్ళిళ్ళ వరకు మహిళలు గోరింటాకు పెట్టుకోవడాని

మహిళల అలంకరణ ప్రాధాన్యతలో గోరింటాకు ప్రత్యేకమైన స్థానం. అట్లతద్ది వంటి పండుగలకు గోరింటాకు పెట్టుకోవడం తెలుగు నేల ఆనవాయితీ. చిన్న శుభకార్యం మెుదలు పండుగలు, పెళ్ళిళ్ళ వరకు మహిళలు గోరింటాకు పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతారు. గోరింటాకుతో పండిన చేతులు, పాదాలు అందాన్ని ఏ నగలు, దుస్తులతో పోల్చలేమంటే అతిశయోక్తి కాదు. గోరింటాకు బాగా పండితే మంచి భర్త వస్తాడని తెలుగు నాట నమ్ముతున్నారు.
 
అవకాశం ఉన్నవారు సాధ్యమైనంతవరకు చెట్టు నుంచి సేకరించిన తాజా గోరింటాకును రుబ్బి వాడడం మంచిది. లేని పక్షంలో మార్కెట్లో లభించే మంచి నాణ్యమైన గోరింటాకును తీసుకుంటే మంచిది. గోరింటాకు ఆకులను కానీ లేదా పొడిని వేడినీళ్ళు కలిపి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇంకా బ్లాక్ టీలో కనుక కలిపి నానబెట్టుకుంటే మరింత డార్క్ కలర్‌తో గోరింటాకు పండుతుంది.
 
మెహిందీ లేదా హెన్నాకు కాఫీ పౌడర్ కలుపుకుని రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు దానికి చేతులకు పెట్టుకోవడం వలన చేతులు కాఫీ బ్రౌన్ కలర్‌లో పండుతాయి. నిమ్మరసంలో పంచదార వేసి చిక్కటి సిరఫ్‌లా తయారుచేసుకోవాలి. మెహింది చేతులకు పెట్టుకున్న తరువాత తడి ఆరే సమయంలో ఈ లెమన్‌ సుగర్‌ సిరఫ్‌‌ను చేతులకు అప్లై చేసుకోవాలి. దాని వల్ల మెహిందీ చేతిలో ఎండిపోయినా రాలిపోకుండా తిరిగి తడిగా ఉండేలా చేస్తుంది ఈ సిరఫ్‌.
 
గోరింటాకు చేతులకు పెట్టుకున్న తరువాత అది చేతుల మీద కనీసం ఆరగంటలు ఉంచుకోవాలి. లెమన్‌ సుగర్‌ సిరఫ్‌‌ను మధ్య మధ్యలో రాస్తుంటే మీరు కోరుకొన్న కలర్‌ మీ చేతుల్లో పండుతుంది. లవంగాలను ఒక పాన్‌లో వేసి వేయించేటప్పుడు వచ్చే పొగ మీద రెండు చేతులను ఒక అంగుళం దూరంలో పెట్టి ఆవిరి పట్టించాలి. 
 
ఆ పొగ చేతులకు వేడి పుట్టించి మెహిందీ మరింత ఎర్రగా పండేలా చేస్తుంది. మెహిందీ పెట్టుకున్న తరువాత ఈ పెయిన్‌ రిలిఫీ బామ్‌ ను అప్లై చేయడమనేది చాల పాత పద్దతి. దీన్ని ఉపయోగించడం వల్ల చేతులకు వేడి పుట్టించి మెహిందీ బాగా ఎర్రగా పండేలా చేస్తుంది. హెన్నా మిశ్రమానికి ఆవనూనె కలిపి గిన్నెలో పెట్టి దానిపై పొడి గుడ్డ కప్పి 10 గంటల పాటు పొడి వాతావరణంలో ఉంచి వాడితే గోరింటాకు బాగా పండుతుంది. గోరింటాకు పండిన తరువాత నేరుగా నీళ్ళు పోసి కడగ కూడదు. 
 
ఎండిన హెన్నాను చెంచా లేదా చాకుతో నెమ్మదిగా తొలగించి అరచేతులపై కొంచెం సున్నం (తాంబులంలో వాడేది) వేసి రెండు అరచేతులకు బాగా రుద్ది నీటితో కడగాలి. అలర్జీల బాధితులు సున్నానికి బదులు కొబ్బరి నూనెతో రుద్దుకొని నీళ్ళతో కడిగితే రంగు ఎక్కువ కాలం నిలుస్తుంది. గోరింటాకు మిశ్రమానికి పుదీనా గుజ్జు లేక పుదీనా నూనె కలిపితే మరింత పండుతుంది.