ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 1 ఫిబ్రవరి 2025 (16:07 IST)

కొత్త ఆదాయపన్ను శ్లాబుల మార్పుల వల్ల ఎవరికెంత లాభం?

income tax slabs
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కొత్త వార్షిక బడ్జెట్లో ఆదాయపన్ను శ్లాబుల్లో మార్పులు చేయనున్నట్టు ప్రటించారు. ఈ కొత్త పన్ను విధానంలో తాజా మార్పుల వల్ల రూ.12 లక్షల ఆదాయం పొందుతున్నవారికి రూ.80 వేలు మేర ఆదాయపు పన్ను లబ్ధి చేకూరుతుందని నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. 
 
అలాగే, రూ.18 లక్షలు ఆదాయపు పొందుతున్న వారికైతే రూ.70 వేలు (ప్రస్తుతం 30 శాతం పన్ను అమలౌతోంది) మేలు చేకూరుతుందన్నారు. అదే రూ.25 లక్షలు ఆదాయం ఉన్న వారికి సవరించిన శ్లాబుల ప్రకారం దాదాపు రూ.1.10 లక్షలు లబ్ధి జరుగుతుందన్నారు. దీనివల్ల ప్రత్యక్ష పన్ను వసూళ్ల రూపంలో లక్ష కోట్ల రూపాయలు, పరోక్ష పన్నుల రూపంలో రూ.2,600 కోట్లు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 
 
ఆదాయపు పన్ను లెక్కింపును మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. వ్యక్తి ఆదాయం రూ.12.75 లక్షలు అనుకుందాం. రూ.75 వేలు ప్రామాణిక తగ్గింపును మినహాయిస్తే పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయ రూ.12 లక్షలు అవుతుంది. దీనిపై శ్లాబుల ప్రకారం పన్ను వర్తింపజేస్తే దాదాపు రూ.60 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అదెలాగంటే.. రూ.0-4 లక్షలు - సున్నా, రూ.4- 8 లక్షలు - 5 శాతం (రూ.20 వేలు), రూ.8-12 లక్షలు -  10 శాతం (రూ.40 వేలు). అంటే మొత్తం రూ.60 వేలు వాస్తవానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సెక్షన్‌ 87ఏ కింద రిబేట్‌ మినహాయిస్తే చెల్లించాల్సి పన్ను సున్నా అవుతుంది.
 
 
దేశంలో వేతనజీవులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గుడ్‌న్యూస్‌ చెప్పారు. కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు ఎలాంటి పన్నూ చెల్లించక్కర్లేదని వెల్లడించారు. ప్రామాణిక తగ్గింపుతో (స్టాండర్డ్‌ డిడక్షన్‌) కలుపుకొంటే రూ.12.75 లక్షల వరకు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించనవసరం లేదని చెప్పారు. కొత్త పన్ను విధానంలో శ్లాబులు సైతం సవరించారు. అయితే, రూ.12 లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదంటూనే రూ.4 లక్షల- రూ.8 లక్షల వరకు ఆదాయంపై 5 శాతం పన్ను వర్తిస్తుందని చెబుతుండడంతో పలువురు అయోమయానికి లోనవుతున్నారు. ఇది తెలియాలంటే పన్ను లెక్కింపు విధానం గురించి తెలియాలి.
 
కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి మినహాయింపులూ ఉండవు. ఒక ఏడాదిలో వచ్చే స్థూల ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి వేతనం ఏడాదికి రూ.12.75 లక్షలు అనుకుంటే అందులో ప్రామాణిక తగ్గింపు రూ.75 వేలు తొలగిస్తారు. ఇప్పుడు రూ.12 లక్షలను పన్ను ఆదాయంగా పరిగణిస్తారు. ఈ పరిమితి వరకు వర్తించే పన్నును ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 87ఏ కింద రిబేట్‌ను మినహాయిస్తారు. అంటే మాఫీ చేసినట్లే. 
 
తాజా బడ్జెట్‌లో ఈ రిబేట్‌ను రూ.60 వేలుగా నిర్ణయించారు. కాబట్టి రూ.12.75 లక్షల వరకు ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే స్థూల ఆదాయం రూ.12.75 లక్షలకు ఒక్క రూపాయి దాటినా రిబేటు వర్తించదు. కాబట్టి పన్ను చెల్లించాల్సి వస్తుంది. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో పన్ను వర్తించని ఆదాయం రూ.7.75 లక్షలుగా (ప్రామాణిక తగ్గింపు రూ.75వేలుతో కలిపి) ఉంది. సెక్షన్‌ 87ఏ కింద రిబేట్‌ రూ.25వేలుగా ఉండేది.