మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By మోహన్ మొగరాల
Last Modified: గురువారం, 7 ఫిబ్రవరి 2019 (20:28 IST)

ఫిబ్రవరి 15న పట్టాలెక్కనున్న ఇంజిన్ లేని ట్రైన్ 18

భారతదేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఇంజన్ రహిత రైలు ఈ నెల పరుగులు పెట్టనుంది. ఫిబ్రవరి 15వ తేదీన దేశంలోనే వేగవంతమైన రైలు.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఈ ఇంజన్ రహిత ట్రైన్‌ని జెండా ఊపి జాతికి అంకితం చేయనున్నారు. 
 
ట్రైన్ 18గా పిలిచే ఈ రైలును వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేసారు. పూర్తి స్వదేశీయతతో రూపొందించిన ఈ ట్రైన్‌ను చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారుచేసారు. ఈ రైలును పరీక్షించగా 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకొని అత్యంత వేగవంతమైన రైలుగా నిలిచింది. ఈ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. దాదాపు 30 సంవత్సరాలుగా ప్రయాణీకులకు సేవలందిస్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో దీనిని ప్రవేశపెట్టనున్నారు. 
 
ఢిల్లీ, వారణాసి మధ్య ఈ రైలును నడపనున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రధాని దీనిని ప్రారంభిస్తారు. స్వదేశంలో తయారైన తొలి రైలు పట్టాలు ఎక్కడం ఎంతో గర్వంగా ఉందని రైల్వే శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఇలాంటి మరికొన్ని ట్రైన్‌లను ప్రయాణీకులకు అందించడం కోసం మరింత కృషి చేస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది.