శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 19 మే 2023 (16:35 IST)

డబ్బులు తిరిగి ఇచ్చేయండి.. వంద రోజులు.. వంద చెల్లింపులు

banks
భారత రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. ఖాతాదారులకు మేలు చేసేలా వంద రోజులు వంద చెల్లింపులు అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద వివిధ రకాల ఖాతాల్లో డబ్బులు జమ చేసి ఏళ్ల తరబడి డ్రా చేసుకోని ఖాతాదారులకు డబ్బులు వెనక్కి ఇచ్చేలా ఆదేశించింది. ఈ పథకం జూన్ ఒకటో తేదీ నుంచి అమలు చేయనుంది. ఈ విషయం ఖాతాదారులకు, వారి వారసులకు తెలిసేలా విస్తృత నిర్వహించాలని పేర్కొంది. 
 
సాధారణంగా బ్యాంకు నిబంధనల ప్రకారం ఎవరైనా ఖాతాదారుడు పొదుపు ఖాతా తెరిచి సొమ్ము జమ చేసిన తర్వాత కనీసం ఆరు నెలలకోసారైనా లావాదేవీ జరపాలి. లేదంటే ఖాతాను స్తంభింపజేస్తారు. ఆ తర్వాత సొమ్ము వేయాలన్నా తీయాలన్నా కుదరదు. బ్యాంకు సిబ్బందిని కలిసి కారణాలు వివరిస్తే ఖాతాను మళ్లీ పునరుద్ధరిస్తారు. ఏకంగా పదేళ్లపాటు ఖాతాను పట్టించుకోకపోతే అందులో నిల్వ ఉన్న సొమ్మునంతా రిజర్వుబ్యాంకు నిధికి బదిలీ చేస్తారు.
 
ఇలాంటి పదేళ్ల ఖాతాల నుంచి, ఫిక్సుడు డిపాజిట్ల నుంచి డ్రా చేయకుండా వదిలేసిన ప్రజల సొమ్ము ఇప్పటి దాకా రూ.35,012 కోట్లు రిజర్వుబ్యాంకు నిధికి చేరింది. ఒకవేళ ఏడాది దాకా లావాదేవీ జరపకపోతే సదరు ఖాతాను పూర్తిగా నిలిపివేస్తారు. ఖాతాదారుడు బ్యాంకుకెళ్లి మళ్లీ తన ఆధార్, ఇంటి చిరునామా, పాన్ కార్డు పత్రాలన్నీ ఇస్తేనే పునరుద్ధరిస్తారు.
 
దీనిని తిరిగి ఖాతాదారులకు అప్పగించేందుకు 'వంద రోజులు- వంద చెల్లింపులు' కార్యక్రమం తీసుకొచ్చారు. ఖాతాలు తెరిచి మరిచిపోయిన వారు గుర్తు చేసుకునేలా ప్రచారం చేపట్టాలి. ప్రతి బ్యాంకు తమ బ్రాంచిల వారీగా అత్యధికంగా సొమ్ము నిల్వ ఉన్న తొలి వంద ఖాతాలపై ప్రధానంగా దృష్టిపెట్టనున్నాయి. బ్యాంకు సిబ్బంది సదరు ఖాతాదారులను సంప్రదించి వారి సొమ్మును వెనక్కి తీసుకునేలా వివరించాలి అని ఆర్బీఐ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.