గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 అక్టోబరు 2022 (14:35 IST)

దేశంలో 5జీ సేవలు ప్రారంభం.. రిలయన్స్ జియో స్పీడ్ ఎంత?

5g service
దేశ వ్యాప్తంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి 5జీ రిలయన్స్ జియో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ సేవలు ప్రారంభమయ్యాయి. అయితే, రిలయన్స్ జియో ఈ నెల 5వ తేదీ నుంచి ఎంపిక చేసిన నాలుగు నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఎయిర్ టెల్ మాత్రం ఒకటో తేదీ నుంచే సేవలు తెచ్చింది. అయితే, ఆయా కంపెనీలు అందిస్తున్న 5జీ డేటా వేగం లెక్కల్ని ఇంటర్నెట్ టెస్టింగ్ కంపెనీ ఓక్లా తాజాగా వెల్లడించింది. 
 
దేశంలో 5జీ నెట్‌వర్క్ డౌన్‌లోడ్ వేగం 500 ఎంబీపీఎస్‌గా ఉందని తెలిపింది. టెలికాం కంపెనీల వారీగా చూస్తే ఢిల్లీలో జియో డౌన్‌లోడ్ సగటు వేగం 598.58 ఎంబీపీఎస్‌గా ఉందని, ఎయిర్‌టెల్ వేగం 197.98గా మాత్రమే ఉందని తెలిపింది. ప్రస్తుతం రిలయన్స్ జియో తన 5జీ సేవలను ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, వారణాసి నగరాల్లో మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. 
 
ముంబైలో రిలయన్స్ జియో వేగం అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ ఈ కంపనీ డౌన్‌లోడ్ వేగం 515.38 ఎంబీపీఎస్‌గా ఉంది. ఎయిర్‌టెల్ డౌన్‌లోడ్ వేగం మాత్రం 271.07 ఎంబీపీఎస్‌గానే ఉంది. అయితే, వారణాసిలో మాత్రం ఎయిర్‌టెల్ వేగం అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ ఎయిర్‌టెల్ డౌన్‌లోడ్ వేగం 516.57 ఎంబీపీఎస్‌గా ఉంది. జియో మాత్రం 485.22 ఎంబీపీఎస్‌గా ఉందని ఓక్లా వివరించింది. అయితే, దేశ వ్యాప్తంగా కమర్షియల్ వేగం పెరిగిన తర్వాత ఈ డేటా వేగంలో స్థిరత్వం రావొచ్చని తెలిపింది.