పిల్లలు పబ్జీ గేమ్ ఆడుతున్నారా..? జాగ్రత్త సుమా...!
పిల్లలు టైమ్‌పాస్ కోసం వీడియో గేమ్‌లు ఆడితే పర్వాలేదు. అదే పనిగా ఆడుతూ వాటికి బానిసైపోతున్నారు. ఆడవద్దని అడిగిన వారిపై విరుచుకుపడుతున్నారు. గట్టిగా మందలిస్తే హత్యలు చేయడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి వెనుకాడటం లేదు. మరీ పబ్జీ గేమ్ అయితే చెప్పనక్కర్లేదు. ఆడేటప్పుడు ఎవరైనా పిలిచినా, ఫోన్ మ్రోగినా పట్టించుకోరు.
దృష్టి మళ్లితే గేమ్‌లో శత్రువులు దాడి చేస్తారేమోనని భయం. ఇంతలా అడిక్ట్ అయి పిల్లలు ఎవరి మాటా వినడంలేదు. ఈ గేమ్‌కి అడిక్ట్ అయ్యి ప్రాణాలు కోల్పోయిన పిల్లలు చాలా మంది ఉన్నారు. మచ్చుకకు ముంబైలో జరిగిన ఓ ఘటన తీసుకుంటే ఓ కుర్రాడు మొబైల్‌లో రోజూ పబ్జీ ఆడేవాడు. ఫోన్‌లో గేమ్ స్లోగా వస్తోందని తల్లిదండ్రులను కొత్త ఫోన్ కొనివ్వమని అడిగాడు.
దాని కోసం రూ.37వేలు అడిగాడు, తమ వద్ద లేదని రూ.20 వేలు మాత్రమే ఇవ్వగలమని చెప్పడంతో కోపగించుకుని ఇంట్లో ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరికొంత మంది పిల్లలు దాని మాయలో పడి హత్యలు కూడా చేస్తున్నారు. ఉదాహరణకు ఢిల్లీలోని సంఘటన. చదువు ప్రక్కనబెట్టి స్నేహితులతో కలిసి తమ్ముడు పబ్జీ ఆడటాన్ని అక్క సహించలేకపోయింది. ఆడవద్దని గట్టిగా మందలించడంతో క్షణికావేశంలో ఆ కుర్రాడు అక్కను కత్తితో పొడిచి చంపేశాడు.
ఇలాంటి సంఘటనే ఒకటి తాజాగా చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఓ కుర్రాడు పబ్జీ ఆడుతున్నాడని తల్లి మందలించినందుకు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్ జిల్లా మల్లారం గ్రామానికి చెందిన వెంకట నారాయణ గజ్వేల్ పట్టణం ప్రజ్ఞాపూర్‌లో స్థిరపడ్డారు. అతని చిన్న కుమారుడు సాయి శరణ్ (18) గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్నాడు. పబ్జీకి బానిసైన కుర్రాడిని తల్లి తిట్టడంతో అదే ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు.