మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 అక్టోబరు 2020 (16:52 IST)

దుబాయ్ నుంచి భారత్‌కు చేరుకున్న 49 మంది ప్రవాసులు..

కరోనా నేపథ్యంలో యూఏఈలో చిక్కుకున్న 49 మంది ప్రవాసులు ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పొట్టకూటి కోసం సుమారు 49 మంది భారతీయులు కొద్ది సంవత్సరాల క్రితం యూఏఈ వెళ్లారు. అక్కడ ఇండియాకు చెందిన ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన పరిశ్రమలలో పనికి కుదిరారు. 
 
అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ మొదలైన తొలినాళ్లలో.. ఈ 49 మంది పని చేస్తున్న పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో ఉపాధి లేక వాళ్లు రోడ్డునపడ్డారు. ఈ క్రమంలో సదరు కార్మికులు తమ సమస్యలను యూఏఈలోని ఇండియన్ మిషన్‌కు వివరించారు. 
 
దీంతో స్పందించిన ఇండియన్ మిషన్.. వారికి అండగా నిలిచింది. జూలై నుంచి వారి యోగక్షేమాలు చూసుకుంది. అంతేకాకుండా వారి ఇబ్బందులను యూఏఈలోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఇండియన్ కాన్సులేట్ అధికారులు రంగంలోకి దిగారు. 
 
దుబాయి పోలీసుల సహాయంతో సదరు కార్మికుల యజమానులను సంప్రదించారు. అంతేకాకుండా ఆ 49 మంది కార్మికులను.. విడతల వారీగా స్వదేశానికి తరలించడం కోసం ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో యూఏఈలో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు.