శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (10:04 IST)

లక్షకు దగ్గరలో కరోనా మృతులు.. భారత్‌కు ప్రపంచ దేశాల ప్రశంసలు

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా లక్షమందిని పొట్టనబెట్టుకుంది. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య 95,718కి చేరుకుంది. ఆ వైరస్ సంక్రమించిన వారి సంఖ్య 16 లక్షలు దాటినట్లు అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ పేర్కొంది. అలాగే కరోనా కారణంగా భారత్‌లో మాత్రం 199 మంది మృతి చెందగా, ఆరువేల మందికి కరోనా సోకింది. అత్యధికంగా మహారాష్ట్రలో 1364 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
 
అలాగే అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటి వరకు వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 16వేలు దాటింది. మహమ్మారి కరోనా ఆ దేశంలో సుమారు 4.6 లక్షల మందికి సోకింది. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. కేవలం మూడు వారాల్లోనే సుమారు కోటిన్నర మంది ఉద్యోగాలు కోల్పోయారు. 
 
ఇకపోతే.. ఇటలీలో కోవిడ్-19 విలయతాండవం చేసింది. ఈ వైరస్ వల్ల ఇటలీలో 18,279 మంది, స్పెయిన్‌లో 15,447 మంది, ఫ్రాన్స్‌లో 12,210 మంది, బ్రిటన్‌లో 7,978 మంది మరణించారు. చైనాలో కొత్తగా కరోనా వైరస్ కేసులు 42 నమోదు అయ్యాయి.
 
ఇదిలా ఉంటే.. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కీలక సమయంలో ప్రపంచ దేశాలకు అవసరమైన ఔషధాలు పంపుతున్న భారత్‌కు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయి. కొవిడ్‌-19 చికిత్సలో ఆశాజనక ఫలితాలు ఇస్తుందన్న మలేరియా నివారణ మందు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను పంపినందుకు ఇప్పటికే అమెరికా, బ్రెజిల్‌ సహా మరికొన్ని దేశాలు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపాయి. తాజాగా ఈ జాబితాలో ఇజ్రాయెల్‌ కూడా చేరింది. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.