గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 మే 2021 (10:34 IST)

దేశంలో తగ్గిపోతున్న కరోనా ఉధృతి - ఆందోళన కలిగిస్తున్న మృతులు

దేశంలో కరోనా వైరల్ వ్యాప్తి ఉధృతి క్రమంగా తగ్గిపోతూ వస్తోంది. వరుసగా మూడు రోజు రెండు లక్షలకు దిగువన నమోదయ్యాయి. అయితే, మరణాలు మాత్రం ఆందోళన కలిగిస్తుండగా.. పెద్ద ఎత్తున బాధితులు కోలుకోవడం కాస్త ఊరట కలిగిస్తున్నది. 
 
గత 24 గంటల్లో దేశంలో 1,65,553 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. కొత్తగా 2,76,309 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
 
మరో వైపు 24 గంటల్లో 3,460 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,78,94,800కు చేరగా.. ఇప్పటి వరకు 2,54,54,320 మంది కోలుకున్నారు. 
 
వైరస్‌ బారినపడి మొత్తం 3,25,972 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 21,14,508 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యశాఖ వివరించింది. వ్యాక్సిన్‌ డ్రైవ్‌లో ఇప్పటి వరకు 21,20,66,614 డోసులు పంపిణీ చేసినట్లు చెప్పింది.
 
మరోవైపు, కేరళ ప్రభుత్వం మరో పది రోజుల పాటు లాక్‌డౌన్‌ను పొడగించింది. అత్యవసరమైన కార్యకలాపాలకు కొంత సండలింపులు ఇస్తూ.. జూన్‌ 9వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను సీఎం పినరయి విజయన్‌ పొడగించారు. 
 
వైరస్‌ కేసులు గణనీయంగా తగ్గుతున్నప్పటికీ ఆంక్షలను తొలగించే దశకు చేరుకోలేదని, ఈ నెల 31 నుంచి జూన్‌ 9వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని తెలిపారు. కరోనా కేసులు భారీగా పెరగడంతో మే 8న ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలులోకి తీసుకువచ్చింది. 
 
అనంతరం 16న, 23న మరోసారి పొడగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. కేసులు ఎక్కువగా ఉన్న మల్లప్పురం జిల్లాలో ట్రిపుల్‌ లాక్‌డౌన్‌ను అమలు చేయగా.. ఉప సంహరిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.