భారత్‌ను వణికిస్తోన్న కరోనా, తగ్గుతున్న కొత్త కేసులు, పెరుగుతున్న మరణాలు
దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విలయం కొనసాగుతోంది. కొద్ది రోజులుగా కొత్త కేసుల్లో తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ.. మృత్యుఘోష మాత్రం ఆగట్లేదు. 24 గంటల వ్యవధిలో రికార్డుస్థాయి మరణాలు సంభవించడం వైద్య వ్యవస్థకు సవాలుగా మారింది. మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..
సోమవారం 18,69,223 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..2,63,533 మందికి పాజిటివ్‌గా తేలింది. వరసగా ఐదో రోజు కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మరణాలు మాత్రం అత్యధికంగా నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 4,329 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఇప్పటివరకు నమోదైన అత్యధిక మరణాలు ఇవే. మే 11(4,205)న మరణాలు సంభవించాయి. ప్రస్తుతం 2.52 కోట్ల మందికి పాజిటివ్‌గా తేలగా.. 2,78,719 మంది ప్రాణాలు గాల్లో కలిశాయి.
కొత్త కేసుల తగ్గుదలతో క్రియాశీల కేసుల్లో భారీ తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం 33,53,765 మంది కొవిడ్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 13.29 శాతంగా ఉంది. ఇంత ఉద్ధృతిలోనూ రికవరీల సంఖ్య ఊరటనిస్తోంది. నిన్న 4,22,436 మంది కోలుకున్నారు. మొత్తంగా 2,15,96,512 మంది వైరస్‌ను జయించారు. రికవరీ రేటు 85.60 శాతంగా ఉంది. మరోవైపు, నిన్న 15,10,418 మందికి టీకా అందింది. మొత్తంగా 18.44 కోట్ల టీకా డోసుల పంపిణీ జరిగింది.
ఒక్క మహారాష్ట్రలోనే 1,000 మరణాలు..
సోమవారం మహారాష్ట్రలో భారీగా కరోనా మరణాలు సంభవించాయి. ఒక్కరోజులో వెయ్యిమంది ప్రాణాలు కోల్పోయారు. మార్చి 30 తరవాత కొత్త కేసులు సంఖ్య 30 వేల దిగువకు చేరినప్పటికీ.. మృతుల సంఖ్య ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. తాజాగా అక్కడ 26,616 మందికి కరోనా సోకింది. ప్రస్తుతం కర్ణాటక(38,603), తమిళనాడు(33,075)లో వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది. కర్ణాటకలో 476 మంది మరణించగా.. తమిళనాడు, దిల్లీలో 300 మందికి పైగా మృత్యుఒడికి చేరుకున్నారు..