బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Modified: గురువారం, 13 మే 2021 (11:40 IST)

Covid: దేశంలో మళ్లీ 4వేల పైన మరణాలు

దిల్లీ: రెండు రోజులు క్రితం కాస్త తగ్గినట్లే కన్పించిన కరోనా మహమ్మారి ఇప్పుడు మళ్లీ విరుచుకుపడుతోంది. వరుసగా రెండో రోజు మరణాలు ఆందోళనకర రీతిలో 4వేల పైనే నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 4,120 మందిని వైరస్‌ పొట్టనబెట్టుకుంది. ఇక కొత్త కేసులు 4లక్షలకు దిగువనే ఉన్నప్పటికీ క్రితం రోజు కంటే స్వల్పంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది..
 
* బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 18.64లక్షల మంది కరోనా పరీక్షలు చేయించుకోగా.. 3,62,727 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అంతక్రితం రోజుతో పోలిస్తే దాదాపు 15వేలు ఎక్కువ. తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 2.37కోట్లకు చేరింది.
 
* ఇదే సమయంలో 4,120 మంది వైరస్‌ సోకి ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారి దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటి వరకు 2,58,317 మందిని బలితీసుకుంది. మరణాల రేటు 1.09శాతంగా ఉంది.
 
* ఇక కొత్త కేసులతో పాటు రికవరీలు కూడా భారీగా ఉంటుండటం కాస్త సానుకూలాంశం. 24 గంటల్లో మరో 3,52,181 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 1.97కోట్ల మంది కరోనాను జయించారు. రికవరీ రేటు 83.26శాతానికి చేరింది.
 
* మరోవైపు బుధవారం నాటితో పోలిస్తే దేశంలో యాక్టివ్‌ కేసులు స్వల్పంగా 6వేలు పెరిగాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 37,10,525 మంది వైరస్‌కు చికిత్స తీసుకుంటున్నారు. క్రియాశీల రేటు 15.65శాతంగా ఉంది.
 
* ఇదిలా ఉండగా.. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. నిన్న 18.94లక్షల మంది టీకా తీసుకున్నారు. ఇప్పటి వరకు 17.72కోట్ల మందికి వ్యాక్సిన అందించారు..*