మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Modified: సోమవారం, 17 మే 2021 (11:58 IST)

కోవిడ్ 19: కేసులు పెరుగుదలలో ఏపీకి 2వ స్థానం, పూర్తి లాక్‌డౌన్ తప్పదేమో?!!

ప్రస్తుతం దేశంలో నిరంతరం కొవిడ్‌ కేసుల పెరుగుదల కనిపిస్తున్న 8 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో ఉంది. కేంద్ర వైద్యఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌అగర్వాల్‌ శనివారం విలేకర్ల సమావేశంలో విడుదల చేసిన డేటా ఈ విషయాన్ని వెల్లడించింది.
 
ఇందులో తమిళనాడు తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. ఆ తర్వాత పశ్చిమబెంగాల్‌, ఒడిశా, పంజాబ్‌, అస్సాం, హిమాచల్‌ప్రదేశ్‌, పుదుచ్చేరిలు చేరాయి. గత రెండువారాలుగా నిరంతరం కేసులు పెరుగుతున్న జిల్లాలు 15 ఉండగా అందులో ఆరో స్థానంలో తూర్పుగోదావరి, పదో స్థానంలో విశాఖపట్నం, 12వ స్థానంలో కడప జిల్లాలు ఉన్నాయి.
 
మే 8-14 తేదీల మధ్య 25.3% పాజిటివిటీ రేటుతో ఆంధ్రప్రదేశ్‌ అత్యధిక పాజిటివిటీ రేటు ఉన్న రాష్ట్రాల జాబితాలో 10వ స్థానంలో నిలిచింది. 42.3%తో పుదుచ్చేరి, 42%తో గోవా, 33.4%తో పశ్చిమబెంగాల్‌ తొలి మూడు స్థానాలను ఆక్రమించాయి. 
 
క్రియాశీలక కేసుల పరంగా ఆంధ్రప్రదేశ్‌ 5వ స్థానం(2,03,787)లో నిలిచింది. దేశంలోని 516 జిల్లాల్లో 10%కి మించి పాజిటివిటీ రేటు ఉండగా, అందులో ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలూ ఉన్నాయి. 
 
 
42 జిల్లాలతో మధ్యప్రదేశ్‌, 37 జిల్లాలతో తమిళనాడు, 35 జిల్లాలతో మహారాష్ట్ర తొలి మూడు స్థానాలను ఆక్రమించాయి. 17 రాష్ట్రాల్లో కేసులు తిరోగమనంలో సాగుతూ ఉన్నాయి. ఇందులో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.