సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 జులై 2020 (17:54 IST)

ఐసోలేషన్ రోగులపై నిఘా - అడుగు బయటపెడితే పసిగట్టేస్తుంది... ఎలా?

కరోనా రోగుల పనిపెట్టేందుకు భారత రక్షణ పరిశోధనా సంస్థ డీఆర్డీవో సరికొత్త యాప్‌ను కనిపెట్టింది. ఈ యాప్ కలిగిన కరోనా రోగులు ఇంటి నుంచి కాలు బయటపెడితే ఇట్టే పసిగట్టేస్తుంది. తద్వారా హోం క్వారంటైన్‍‌లో ఉన్న కరోనా రోగులు ఎక్కడ ఉన్నారో తెలుసుకునే అవకాశం ఉంది. 
 
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ వైరస్ వ్యాప్తి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలైన చర్యలు తీసుకుంటున్నా, వైరస్ వ్యాప్తి మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా, వైరస్‌ వ్యాప్తిని నిరోధించడం కరోనాపై పోరులో అత్యంత కీలకమైన అంశం హోం క్వారంటైన్. అయితే హోం క్వారంటైన్‌ లేదా ఐసొలేషన్‌లో ఉండాల్సిన కొందరు యథేచ్ఛగా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నారు. 
 
దీంతో కొవిడ్‌ మరింత వేగవంతంగా వ్యాప్తి చెందుతోంది. ఇలాంటి వారిని నిరంతరం పర్యవేక్షించడం పోలీసులు మరియు ఆరోగ్య సిబ్బందికి పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) సంపర్క్‌ పేరుతో యాప్‌ను రూపొందించింది. దీని ద్వారా హోం క్వారంటైన్‌, ఐసొలేషన్‌లో ఉన్న రోగులను నిరంతరం పర్యవేక్షించవచ్చు. వారి కదలికలను గమనించవచ్చు. డీఆర్‌డీవోకు చెందిన సెంటర్‌ ఫర్‌ ఏఐ అండ్‌ రోబోటిక్స్‌ విభాగం దీనిని అభివృద్ధి చేసింది.
 
ఎలా పని చేస్తుంది? 
స్మార్ట్‌ ఆటోమేటెడ్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ పేషెంట్స్‌ అండ్‌ రిస్క్స్‌(సంపర్క్‌) పేరుతో డీఆర్‌డీవో రూపొందించిన ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా క్వారంటైన్‌ లేదా ఐసొలేషన్‌లో ఉన్నవారిని పర్యవేక్షించవచ్చు. జియోఫెన్సింగ్‌, ఫేస్‌ రికగ్నిషన్‌, మ్యాప్‌లో ఉన్న డాటా ఆధారంగా పోలీస్‌, వైద్యారోగ్య విభాగాలు హోం క్వారంటైన్‌ లేదా ఐసొలేషన్‌లో ఉన్న వారి కదలికలను గుర్తించవచ్చు.
 
కృత్రిమ మేధస్సు ఆధారంగా పని చేసే ఇందులో రోగి పేరు, సెల్‌ ఫోన్‌ నంబరు, ఫోన్‌ ఐఎంఈఐ నంబరు, క్వారంటైన్‌ ప్రాంతం, క్వారంటైన్‌ యొక్క కాలపరిమితి, మెయిల్‌ ఐడీ, ఫొటో వంటివి సమర్పించాల్సి ఉంటుంది. ఈ యాప్‌ను రోగి స్మార్ట్‌ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఇది ప్రతి పది నిమిషాలకోసారి కొవిడ్‌ సర్వర్‌కు అలర్ట్‌ అందజేస్తుంది. 
 
ఈ యాప్‌ ద్వారా రోగులు సంపర్క్‌ యాప్‌కు సెల్ఫీలు సైతం పంపించవచ్చు. రోగి జియోఫెన్సింగ్‌ ప్రాంగణాన్ని వరుసగా నాలుగుసార్లు ఉల్లంఘించిస్తే స్మార్ట్‌ఫోన్‌ ద్వారా హెచ్చరిక సందేశం పంపిస్తుంది. రిజిస్ట్రేషన్‌ సమయంలో సమర్పించిన సెల్ఫీకి, అనంతరం ఇచ్చిన సెల్ఫీకి మధ్య పొంతన లేకపోయినా యాప్‌ అలర్ట్‌ ఇస్తుంది. 
 
ఇలాంటి ఉల్లంఘనుల వివరాలు ఎరుపు రంగులో చూపిస్తుంది. క్వారంటైన్‌ గడువు ముగిసిన అనంతరం రోగి ఈ నిఘా నుంచి విముక్తుడవుతారు. తర్వాత యాప్‌ను తొలగించుకోవచ్చు. 
 
త్వరలో పైలట్‌ ప్రాజెక్టుగా.. 
త్వరలో రాష్ట్రంలోని ఏదైనా జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా దీనిని అమలు చేయనున్నారు. దీనికోసం క్షేత్రస్థాయి భాగస్వామిగా తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ (టీటా) పనిచేయనుంది. దీనికి సంబంధించి సోమవారం ఇరు సంస్థల మధ్య ఎంవోయూ జరిగింది. జిల్లాలో వచ్చిన ఫలితాల అనంతరం దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు.