శుక్రవారం, 29 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (16:16 IST)

పుల్వామా దాడి ఖండన : ఇమ్రాన్ ఖాన్ ఫోటో తొలగింపు

పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ప్రస్తుతం ఆ దేశ ప్రధానిగా ఉన్నారు. అయితే, పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తూ సీసీఐ (క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా) ఇమ్రాన్ ఖాన్ ఫోటోలను తొలగించింది. బ్రాబోర్న్‌ స్టేడియంలో ఉన్న ఇమ్రాన్‌ ఖాన్ ఫొటోలను తీసివేయాల్సిందిగా మేనేజింగ్‌ కమిటీ నిర్ణయించింది. అంతేకాదు ఇమ్రాన్‌ఖాన్‌ ఉన్న పాకిస్థాన్ జట్టు ఫొటోను కూడా తొలగించారు. 
 
'ఆల్‌ రౌండర్' విభాగంలో ఇమ్రాన్‌ ఖాన్‌ ఫొటోను, క్రికెట్‌ జట్టు విభాగంలో పాకిస్థాన్‌ ఫొటోలను ఇక్కడ ఉంచారు. ఆ టీమ్‌లో ఇమ్రాన్‌ కూడా ఉండటంతో ఈ ఫొటోలను అక్కడ నుంచి తీసేశారు. భారతీయ ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకున్నామని మేనేజింగ్‌ కమిటీ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. 
 
ఇమ్రాన్‌ ఖాన్‌ పాకిస్థాన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన ఫొటోను క్లబ్‌ గ్యాలరీ నుంచి తొలగించాలంటూ సిసిఐపై ఒత్తడి వస్తూనే ఉంది. ఇమ్రాన్‌ క్రికెట్‌లో సాధించిన రికార్డులు, ఘనతలకు గౌరవమిస్తూ సీసీఐ ఆయన ఫొటోలను తొలగించలేదు. పుల్వామా ఉగ్రదాడిలో 49 మంది భారత జవాన్లు మృతి చెందారు. ఈ దారుణ ఘటనను ఇమ్రాన్‌ ఖాన్ ఖండించలేదు. దీనిపై ఆయన మౌనం వహించడాన్ని సీసీఐ ఖండించింది. దీంతో ఫొటోలను అక్కడి నుంచి తొలగిస్తూ సీసీఐ నిర్ణయం తీసుకుంది.