మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 28 ఫిబ్రవరి 2019 (09:13 IST)

కంగారులను పిలిపించి కుమ్మించుకున్న టీమిండియా

సొంతగడ్డపై కోహ్లీ సేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియాపై కంగారులు పైచేయి సాధించారు. ప్రపంచ కప్‌కు ముందు భారత్‌లో ట్వంటీ20, వన్డే సిరీస్ ఆడేందుకు వచ్చిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు బుధవారం రాత్రి జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. అదీ కూడా భారత గడ్డపై ఆస్ట్రేలియా జట్టు తొలిసారి ట్వంటీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది.  
 
బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 191 పరుగులు చేసింది. భారత్‌కు ఓపెనర్లు ధవన్ (14), రాహుల్ మంచి ఆరంభాన్నిచ్చారు. తొలి నాలుగు ఓవర్లలో మూడు ఫోర్లే వచ్చినా.. ఐదో ఓవర్‌లో రాహుల్ జోరు చూపెట్టాడు. వీరిద్దరి జోరు కారణంగా పవర్‌ప్లేలో టీమ్‌ఇండియా 8 రన్‌రేట్‌తో 53 పరుగులు చేసింది. తొమ్మిదో ఓవర్‌లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. దీంతో తొలి వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 
 
ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చినా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలకడగా బ్యాటింగ్ చేశాడు. అయితే, 10వ ఓవర్‌లో అంపైర్ తప్పుడు నిర్ణయానికి ధవన్... 11వ ఓవర్‌లో రిషబ్ (1) చెత్త షాట్‌తో మూల్యం చెల్లించుకున్నాడు. కేవలం 10 బంతుల తేడాలో ఈ ఇద్దరూ ఔట్‌కావడంతో భారత్ 74 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది.
 
ఆ తర్వాత కెప్టెన్‌తో జతకలిసిన మాజీ కెప్టెన్ ధోనీలు కలిసి ఆసీస్ బౌలర్లను చితక్కొట్టారు. పరస్పరం బ్యాటింగ్‌ను ఆస్వాదించుకుంటూ కేవలం 29 బంతుల్లోనే 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలి మ్యాచ్‌లో సరిగా ఆడలేదని విమర్శలు ఎదుర్కొంటున్న మహీ.. షార్ట్ బౌలింగ్‌లో మిడ్‌వికెట్ మీదుగా భారీ సిక్సర్‌తో ఖాతా తెరిచాడు. అలాగే, విరాట్ కోహ్లీ మ్యాచ్ 16వ ఓవర్ (కోల్టర్‌నీల్)లో వరుసగా 6, 6, 6తో 22 పరుగులు పిండుకున్నాడు. 
 
ఈ క్రమంలో 29 బంతుల్లో 22వ అర్థసెంచరీ పూర్తి చేశాడు. 18వ ఓవర్‌లో (షార్ట్) ధోనీ.. 6, 6, 4తో 19 పరుగులు రాబట్టడంతో స్కోరు బోర్డు వాయువేగంతో ముందుకెళ్లింది. 19వ ఓవర్‌లో కోహ్లీ సిక్స్, ఫోర్ బాదినా.. ఆఖరి ఓవర్‌లో ధోనీ ఔటయ్యాడు. ఈ ఇద్దరి మధ్య నాలుగో వికెట్‌కు 50 బంతుల్లోనే 100 పరుగులు జతయ్యాయి. తర్వాత కార్తీక్ (8 నాటౌట్) రెండు ఫోర్లు బాదితే.. ఇన్నింగ్స్ ఆఖరి బంతిని కోహ్లీ సూపర్ సిక్స్‌తో ముగించాడు. చివరి 9 ఓవర్లలో 116 పరుగులు వచ్చాయి. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగులు చేసింది. 
 
ఆ తర్వాత 191 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు మ్యాక్స్‌వెల్ వీరవిహారం కారణంగా మరో రెండు బంతులు మిగిలివుండగానే ఏడు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. దీంతో భారత్‌పై తొలిసారిగా టీ20 సిరీస్‌ను ఆసీస్ నెగ్గింది. ఈ మ్యాచ్‌లో మాక్స్‌వెల్‌ (113 నాటౌట్, 55 బంతుల్లో 7×4, 9×6) అజేయ శతకం సాధించాడు. ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్‌లో వన్ మ్యాన్ షో చేసిన మాక్స్‌వెల్‌కి 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్', 'మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్' అవార్డులు దక్కాయి.