కోహ్లీ సేన జైత్రయాత్రకు బ్రేక్ వేసిన ఇంగ్లండ్.. సెమీస్ ఆశలు సజీవం
ప్రపంచ క్రికెట్ కప్ పోటీల్లో భాగంగా, ఆదివారం బర్మింగ్ హామ్ వేదికగా ఇంగ్లండ్ భారత్ క్రికెట్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జైత్రయాత్రకు ఇంగ్లీష్ ఆటగాళ్లు బ్రేక్ వేశారు. ఫలితంగా ఈ వరల్డ్ కప్ పోటీల్లో కోహ్లీ సేన తొలి ఓటమిని చవిచూసింది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ చివరిదాకా పోరాడి 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. తద్వారా ఇంగ్లండ్ జట్టు సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది.
338 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్... ఓపెనర్ కేఎల్ రాహుల్ డకౌట్ కాగా, మరో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో ఆదుకున్నాడు. అలాగే, కెప్టెన్ విరాట్ కోహ్లీ (66) సమయోచిత బ్యాటింగ్‌కుతోడు రిషబ్ బంత్ 32, పాండ్యా 45, ధోనీ (42 నాటౌట్)), జాదవ్(12 నాటౌట్) చొప్పున పరుగులు చేయగా, నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. దీంతో భారత్ 31 పరుగుల తేడాతో ఓడిపోయింది.
సెమీస్‌కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్లు విశ్వరూరం ప్రదర్శించారు. క్రీజులోకి దిగింది మొదలు బంతిని బౌండరీకి తరలించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఓపెనర్లు జాసన్ రాయ్-జానీ బెయిర్‌స్టోలు చెలరేగిపోయారు. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 160 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఇంగ్లండ్ ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో 13 సిక్సర్లు, 26 ఫోర్లు కొట్టారంటే ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ ఏ విధంగా చెలరేగిపోయారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది.
ఓపెనర్లుగా బరిలోకి దిగిన జాసన్ రాయ్, జానీ బెయిర్ స్టో జట్టుకు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ కళ్లు చెదిరిపోయే షాట్లు కొడుతూ భారత బౌలర్లను బెంబేలెత్తించారు. బ్యాటింగ్‌కు అనుకూలించిన ఈ పిచ్‌పై వీరిద్దరూ దూకుడుకే ప్రాధాన్యమిచ్చారు. దీంతో భారత బౌలర్లకు కష్టాలు తప్పలేదు. ఎలాంటి బంతివేసినా సిక్సర్ బాదాలన్న కసితో రాయ్, బెయిర్ స్టో ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
వీరిద్దరి వీర కుమ్ముడు దెబ్బకు భారత బౌలర్లు బేజారయ్యారు. వీరిద్దరూ ఓపెనింగ్ భాగస్వామ్యంగా 23 ఓవర్లలో ఏకంగా 163 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇందులో రాయ్ 66 పరుగులు చేయగా, స్టో (111) సెంచరీ చేశాడు. స్టో తన ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరు సిక్సర్లు, 10 ఫోర్లతు కొట్టి సత్తా చాటాడు. చివరకు స్టో వికెట్‌ను మహ్మద్ షమి నేలకూల్చాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయే సమయానికి ఆ జట్టు స్కోరు 205 పరుగులు చేసింది.
ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రూట్ 44, మోర్గాన్, బట్లర్ 20, స్టోక్స్ 78, వోక్స్ 7, ప్లుంకెట్ 0 చొప్పున పరుగులు చేశారు. స్టోక్స్ మాత్రం విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 54 బంతుల్లో 79 పరుగులు చేశాడు. మూడు సిక్స్‌లు, ఆరు ఫోర్లు బాదాడు. మహ్మద్ షమీ ఐదు వికెట్లు తీశాడు. ఈ ప్రపంచ కప్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా షమీ రికార్డు సృష్టించాడు. భారత్ గెలవాలంటే 50 ఓవర్లలో 338 పరుగులు చేయాల్సివుండగా, 306 పరుగుల వద్ద ఆగిపోయింది.