శనివారం, 30 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (13:29 IST)

పిచ్‌పై దెయ్యాలేమీ లేవు.. రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇంగ్లాండ్‌తో జరిగిన డే/నైట్‌ టెస్టులో పిచ్‌ను తప్పుపట్టాల్సిన పని లేదని, నేరుగా వికెట్లకు విసిరిన బంతులకే చాలా మంది బ్యాట్స్‌మెన్ ఔటయ్యారని టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ ఆటగాళ్లే కాకుండా టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ కూడా తప్పులు చేశారని చెప్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో తామూ సరిగ్గా ఆడలేకపోయామని స్పష్టం చేశాడు. పిచ్‌ విషయంలో ఎలాంటి తప్పు లేదని.. దానిపై దెయ్యాలేం లేవన్నాడు. ఒక్కసారి కుదురుకుంటే ఆ పిచ్‌ మీద పరుగులు చేయొచ్చని హిట్‌మ్యాన్‌ వివరించాడు.
 
అయితే, స్పిన్‌కు అనుకూలించే ఇలాంటి పిచ్‌ మీద జాగ్రత్తగా ఆడాలని రోహిత్‌ అభిప్రాయపడ్డాడు. 'పరుగులు చేయాలంటే కాస్త ఆలోచించాలి. ప్రతీ బంతిని డిఫెన్స్‌ చేయడం కూడా సరికాదు. అలా చేస్తే కొన్నిసార్లు బంతి అనూహ్యంగా తిరిగి వికెట్ల మీదకు దూసుకెళ్తుంది. పరిస్థితులను బట్టి షాట్‌లు ఆడేందుకు కూడా వెనుకాడొద్దు.
 
నేను బ్యాటింగ్‌ చేసేటప్పుడు వికెట్‌ కాపాడుకోవడం ఒక్కటే నా ఉద్దేశం కాదు.. పరుగులు కూడా చేయాలనుకున్నాను. మంచి బంతులను గౌరవిస్తూనే చెడ్డ బంతులను వేటాడా' అని రోహిత్‌ చెప్పుకొచ్చాడు. కాగా.. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ తొలి ఇన్నింగ్స్‌ 66 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌ 25 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. టీమ్‌ఇండియా 10 వికెట్ల తేడాతో గెలుపొంది టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు మరింత చేరువైంది.