ఐసీసీ ప్రపంచ కప్ : భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్న క్రికెటర్లు వీరే..
వచ్చే అక్టోబరు 5వ తేదీన నుంచి భారత్ వేదికగా ప్రతిష్టాత్మక ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీల కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) భారత జట్టును ప్రకటించింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ రోహిత్ శర్మను కెప్టెన్‌గా ప్రకటించింది. మొత్తం 15 మందితో జట్టును ప్రకటించారు.
ఆసియా కప్‌తో పునరాగమనం చేసిన శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లకు అవకాశం దక్కింది. సీనియర్ స్టార్ పేసర్ బుమ్రా పేస్ దళాన్ని ముందుండి నడిపించనున్నాడు. వన్డేల్లో పెద్దగా రాణించలేకపోతున్నప్పటికీ సూర్యకుమార్ యాదవ్ వైపు సెలక్టర్లు మొగ్గుచూపారు. శార్దూల్ ఠాకూర్, హార్దిక్ పాండ్యను పేస్ ఆల్‌రౌండర్లుగా.. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌కు స్పిన్ ఆల్‌రౌండర్లుగా అవకాశం కల్పించారు.
యుజ్వేంద్ర చాహల్‌కు మరోసారి నిరాశే మిగలగా.. కుల్‌దీప్ యాదవ్‌ను స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా తీసుకున్నారు. హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ, ప్రసిధ్ కృష్ణతోపాటు వికెట్ కీపర్ సంజు శాంసన్‌కు అవకాశం దక్కలేదు. వరల్డ్ కప్ విషయానికొచ్చేటప్పటికీ సెలక్షన్ కమిటీ అనుభవానికి ఓటేసినట్లు అర్థమవుతోంది. ఆ కారణంతోనే తిలక్‌ను కాదని సూర్యకుమార్, రాహుల్, శ్రేయస్‌కు జట్టులో స్థానం ఇచ్చారు.
ప్రసిధ్ కృష్ణ విషయానికొస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అందులోనూ భారత్‌లో మ్యాచ్‌లు జరగనుండటంతో అదనపు పేసర్ అవసరం లేదని టీమ్‌ఇండియా సెలెక్షన్ కమిటీ భావించినట్లు సమాచారం. బుమ్రా, షమీ, సిరాజ్ రూపంలో స్పెషలిస్ట్ పేసర్లు జట్టులో ఉన్న విషయం తెలిసిందే. సంజూ శాంసన్‌కు అడపాదడపా అవకాశాలు ఇచ్చినా అంచనాల మేరకు రాణించలేకపోయాడు. మరోవైపు వచ్చిన అవకాశాలను ఇషాన్ కిషన్ రెండుచేతులా ఒడిసిపట్టాడు.