శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 12 మార్చి 2019 (15:56 IST)

ఆస్ట్రేలియాతో సమరం : ధోనీ లేకుంటే భారత్ కప్ గెలవలేరా? (video)

స్వదేశంలో పర్యాటక ఆస్ట్రేలియాతో భారత్ ఐదు వన్డేల సిరీస్‌ను ఆడుతోంది. ఇప్పటివరకు జరుగిన నాలుగు వన్డేల్లో ఇరు జట్లూ రెండేసి మ్యాచ్‌లలో గెలుపొంది సమ ఉజ్జీవులుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీ వేదికగా సిరీస్ ఫలితాన్ని శాసించే ఐదో వన్డే మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం కీపింగ్ బాధ్యతలను ధోనీకి అప్పగించాలని క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి బలమైన కారణం లేకపోలేదు. 
 
తొలి రెండు మ్యాచ్‌ల్లో ధోనీకి చోటు కల్పించారు. ఈ మ్యాచ్‌లలో భారత్ విజయభేరీ మోగించింది. ఆ తర్వాత ఆయనకు విశ్రాంతినిచ్చారు. ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకుని ధోనీ స్థానంలో యువ కీపర్ రిషబ్ పంత్‌కు చోటు కల్పించారు. 
 
అయితే, రిషబ్ పంత్ కీపింగ్‌ను చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా, మొహాలి వేదికగా జరిగిన నాలుగో వన్డే మ్యాచ్‌లో సులభంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. దీనికి ప్రధాన కారణం చెత్త కీపింగ్. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు ఇచ్చిన ఒక క్యాచ్‌తో పాటు నాలుగు స్టంపింగ్‌లను రిషబ్ పంత్ జారవిడిచాడు. ఫలితంగా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు ఏకంగా 350 పై చిలుకు లక్ష్యాన్ని అలవోకగా ఛేదించారు. ఫలితంగా ఆస్ట్రేలియా సంచలన విజయం నమోదు చేసుకుని సిరీస్‌ను 2-2తో సమం చేసింది. 
 
ఈ నేపథ్యంలో సిరీస్ ఫలితం తేల్చే ఐదో వన్డే మ్యాచ్ ఢిల్లీ వేదికగా బుధవారం జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రకటించే భారత జట్టులో కీపింగ్ బాధ్యతలను ధోనీకి అవకాశం కల్పించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. రిషబ్ పంత్ స్థానంలో ధోనీని తీసుకోవాలని కోరుతున్నారు. అయితే, ధోనీ మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. 
 
రిషబ్ కీపింగ్ నైపుణ్యంపై ఎలాంటి సందేహాలు అక్కర్లేదన్నారు. పైగా, రిషబ్ యువ క్రికెటర్ అని.. ఇపుడు అతన్ని మ్యాచ్ నుంచి తొలగిస్తే అది అతని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుందని, ఇది అతని కెరీర్‌పై ప్రభావం పడుతుందన్నారు. అందువల్ల చివరి వన్డేలో కూడా కీపింగ్ బాధ్యతలను రిషబ్‌కే అప్పగించాలని అభిప్రాయపడుతున్నాడు. 
 
కాగా, ఈ మ్యాచ్‌ కోసం ప్రకటించే తుది 11 మంది భారత తుది జట్టులో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, భువనేశ్వర్, కుల్దీప్ యాదవ్, బుమ్రాలకు చోటు కల్పించే అవకాశం ఉంది.