శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 నవంబరు 2019 (15:05 IST)

కార్న్‌వాల్‌ అదుర్స్.. ఏడు వికెట్లతో దుమ్ము రేపాడు

ప్రపంచకప్ అనంతరం భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 'యూనివర్సల్‌ బాస్‌' క్రిస్‌ గేల్‌కు విండీస్ సెలెక్టర్లు అవకాశం ఇవ్వలేదు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అదరగొడుతున్న కార్న్‌వాల్‌కు జట్టులో చోటు కల్పించారు. ఆంటిగ్వాకు చెందిన కార్న్‌వాల్‌ను సరదాగా 'మౌంటైన్‌ మ్యాన్‌'గా పిలుస్తారు. అయితే ఇలా పిలవడానికి అసలు కారణం మాత్రం అతడి భారీకాయం. 
 
కార్న్‌వాల్‌ ఆరు అడుగుల ఆరు అంగుళాల ఎత్తు, 140 కిలోల బరువు ఉండడం విశేషం. కార్న్‌వాల్‌ క్రికెట్‌లో రాణించలేడని అందరూ భావించారు. కానీ.. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో నిలకడ ప్రదర్శన చేస్తూ అంతర్జాతీయ మ్యాచులకు ఎంపిక అయ్యాడు. ఈ నేపథ్యంలో భారత్‌లోని లఖ్‌నవూ వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టులో వెస్టిండీస్‌ బాహుబలిగా పేరు తెచ్చుకున్న రకీమ్ కార్న్‌వాల్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. 
 
75 పరుగులకు 7 వికెట్లు పడగొట్టడంతో ఆప్ఘనిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 187 పరుగులకే ఆలౌట్ అయింది. బాహుబలి చెలరేగడంతో ఆఫ్ఘన్ బ్యాట్స్‌మెన్‌లో జావెద్‌ (39), అమిర్‌ (34), అఫ్సర్‌ (32) మాత్రమే మోస్తరుగా రాణించారు. ఇంతవరకు భారత్‌ పిచ్‌లపై ఒక ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు సాధించిన మూడో విండీస్‌ బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. కార్న్‌వాల్‌ కంటే ముందు ఆండీ రాబర్ట్స్‌, లాన్స్‌ గిబ్స్‌ మాత్రమే ఏడు వికెట్లు తీశారు.
 
స్పిన్‌కు అనుకూలించే అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం పిచ్‌పై కార్న్‌వాల్‌ అఫ్గాన్‌ బ్యాట్స్‌మన్ బెంబేలెత్తించాడు. ఏడు వికెట్లతో కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసాడు. కార్న్‌వాల్‌ దెబ్బకు అఫ్గానిస్థాన్ ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్ (17) త్వరగానే పెవిలియన్ చేరాడు. అనంతరం జావేద్ అహ్మది (39) వర్రీకాన్ ఔట్ చేసాడు. 
 
ఈ సమయంలో బాహుబలి విజృంభించడంతో అఫ్గానిస్థాన్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఇహ్సానుల్లా జనత్ (24), రహమత్ షా (4), అస్గర్ ఆఫ్ఘన్ (4), నాసిర్ జమాల్ (2), అఫ్సర్ జజాయ్ (32), యమిన్ అహ్మద్జాయ్ (18) వికెట్లను కార్న్‌వాల్‌ ఖాతాలో వేసుకున్నాడు.