శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 3 జూన్ 2024 (12:24 IST)

నార్వే చెస్ టోర్నీలో ఉత్తమ ప్రదర్శన కనబరుస్తున్న ప్రజ్ఞానంద

pragnananda
నార్వే వేదికగా జరుగుతున్న నార్వే చెస్ టోర్నీలో భారత చదరంగ ఆటగాడు ప్రజ్ఞానంద తన సత్తా చాటుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన అన్ని పోటీలలో తన ప్రత్యర్థుల కంటే ఉత్తమ ప్రదర్శన కనబరుస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. ఈ టోర్నీ మూడో రౌండ్‌లో ప్రపంచ నంబర్ వన్ కార్ల్సన్‌ను కంగుతినిపించిన ఈ యువ గ్రాండ్ మాస్టర్.. తాజాగా ఐదో రౌండ్లో ప్రపంచ రెండో ర్యాంకర్ ఫాబియానో కరువానా (అమెరికా)పై విజయం సాధించాడు. 
 
ఓ క్లాసికల్ చెస్ టోర్నీలో ప్రపంచ టాప్-2 ర్యాంకర్లను ప్రజ్ఞానంద తొలిసారి ఓడించాడు. ఆట ఆఖరులో కరువానాతో గేమ్ డ్రాగా ముగిసేలా కనిపించింది. కానీ 66వ ఎత్తులో కరువానా తప్పిదాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న ప్రజ్ఞానంద మరో 11 ఎత్తుల్లోనే విజయాన్ని అందుకున్నాడు. ఈ గెలుపుతో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రజ్ఞానంద టాప్-10లోకి వచ్చాడు. ప్రత్యక్ష ర్యాంకింగ్స్‌లో 2754.7 ఎలో రేటింగ్ పాయింట్లతో పదో స్థానంలో నిలిచాడు. మరోవైపు ఈ టోర్నీ అయిదో రౌండ్‌లో అలీ రెజా (ఫ్రాన్స్) పై కార్ల్సన్ (నార్వే), ప్రపంచ ఛాంపియన్ లిరెన్ (చైనా)పై హికరు నకముర (అమెరికా) గెలిచారు. 
 
అలాగే, ఐదు రౌండ్లు పూర్తయేసరికి నకముర (10), కార్ల్సన్ (9), ప్రజ్ఞానంద (8.5) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. మహిళల విభాగం ఐదో రౌండ్‌లో వైశాలి ఆర్మగెడాన్ విజయంతో టింగ్‌పై పైచేయి సాధించింది. వైశాలి (10) అగ్రస్థానంలో కొనసాగుతోంది. కోనేరు హంపి (4) ఐదో స్థానంలో ఉంది.