శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 7 మే 2019 (19:43 IST)

కోహ్లీపై కోపం... తలుపును బలంగా తన్నిన అంపైర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీ లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. అయితే, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు తన చివరి లీగ్ మ్యాచ్‌ను సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడింది. 
 
అయితే, ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌ ఉమేశ్ యాదవ్ వేసిన ఆఖరి ఓవర్‌లో ఓ బంతి నోబాల్ కాకపోయినప్పటికీ.. ఫీల్డ్ అంపైర్ నిగెల్ లాంగ్ దాన్ని నోబాల్‌గా ప్రకటించారు. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీకి తీవ్ర ఆగ్రహం వచ్చింది. బౌలర్ ఉమేష్ కూడా అంపైర్‌తో గొడవకు దిగారు. మరో అంపైర్ సర్ది చెప్పడంతో ఆ గొడవ అంతటితో సద్దుమణిగిపోయింది. మ్యాచ్ యధావిధిగా కొనసాగింది. 
 
కానీ, అసలు కథ మ్యాచ్ ముగిసిన తర్వాతే ప్రారంభమైంది. కోహ్లీతో గొడవ పడిన కోపంలో అంపైర్ నిగెల్ లాంగ్.. స్టేడియంలోని ఓ తలుపును బలంగా తన్నడంతో అదికాస్త విరిగిపోయింది. ఈ విషయాన్ని స్టేడియం అధికారులు గుర్తించి బీసీసీఐకు ఫిర్యాదు చేశారు. దీంతో అంపైర్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకునే దిశగా బీసీసీఐ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. 
 
మరోవైపు, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్.సుధాకర్‌ రావు మాట్లాడుతూ, 'మేము కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్(సీఓఏ)కి ఈ వివాదంపై ఫిర్యాదు చేయగా, ఖచ్చితంగా వారు స్పందించి, నిగెల్‌పై చర్య తీసుకుంటారని భావిస్తున్నట్టు చెప్పారు. మైదానంలో దురుసుగా ప్రవర్తించే ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటే.. అదే మైదానంలో ఉండే అంపైర్లు ఆ విధంగా ప్రవర్తిస్తే ఎందుకు చర్యలు తీసుకోరని ఆయన ప్రశ్నిస్తున్నారు. 
 
కాగా, ఈ ఫిర్యాదుపై బీసీసీఐ స్పందించి చర్యలు తీసుకున్నట్టయితే తదుపరి మ్యాచ్‌లకు ఆయన దూరమయ్యే అవకాశాలు లేకపోలేదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. కాగా, నిగెల్ లాంగ్ తన క్రికెట్ కేరీర్‌లో 56 టెస్టులు, 123 వన్డేలు, 32 టీ-20లకు అంపైరింగ్ చేశారు. అలాగే, ఈనెలాఖరు నుంచి ఇంగ్లండ్ వేదికగా ప్రారంభంకానున్న ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలో కూడా అంపైరింగ్ చేయనున్నారు.