గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 ఆగస్టు 2021 (21:29 IST)

ఉన్ముక్త్ చంద్ షాకింగ్ నిర్ణయం: రిటైర్మెంట్ ప్రకటన.. విదేశీ లీగ్‌ల్లో ఆడుతాడట!

Unmukt Chand
భారత యువ క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. శుక్రవారం భారత్‌ క్రికెట్‌కు అతడు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకే తాను భారత్‌ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ఉన్ముక్త్‌ స్పష్టం చేశాడు. ఇదే విషయమై ఉన్మక్త్‌ ట్విటర్‌ వేదికగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి సుధీర్ఘ లేఖ రాశాడు. 
 
2012 అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత కెప్టెన్‌గా ఉన్ముక్త్‌ చంద్‌ (111 పరుగులు నాటౌట్‌) వీరోచిత సెంచరీతో టీమిండియాకు కప్‌ అందించి తొలిసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆపై అంచనాలు అందుకోని అతడు టీమిండియాకి ఆడకుండానే రిటైర్మెంట్ ఇచ్చాడు.
 
భారత్‌ క్రికెట్‌కు తన రిటైర్మెంట్‌పై ఉన్ముక్త్‌ చంద్‌ స్పందిస్తూ... 'భారత్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించడం కాస్త బాధ కలిగించింది. చాలాకాలంగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపింది. తాజాగా రిటైర్మెంట్‌తో భారత్‌ క్రికెట్‌కు ఇక ప్రాతినిధ్యం వహించలేననే విషయం ఒక నిమిషం తన గుండెను ఆపేసింది. కానీ విదేశీ లీగ్‌ల్లో ఆడాలనే కోరికతో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. ఇంతకాలం తనకు అండగా నిలిచిన భారత క్రికెట్‌ ప్రేమికులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని తెలిపాడు. 
 
కెరీర్ ప్రారంభంలోనే తనకు అవకాశాలు కల్పించిన డీడీసీఏకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నాడు. దిగ్గజ ఆటగాళ్ల మధ్య ఏళ్ల తరబడి గడపడం గొప్ప విషయమని ఉన్ముక్త్‌ తెలిపాడు. సహచరులుకు, కోచ్‌లకు, సపోర్ట్ స్టాఫ్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఉన్ముక్త్.. ఈ జ్ఞాపకాలు ఎల్లకాలం తనతో ఉండిపోతాయని చెప్పుకొచ్చాడు.
 
మరోవైపు 2012 అండర్-19 ప్రపంచకప్ తర్వాత భారత-ఎ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఉన్ముక్త్ చంద్.. రెగ్యులర్ ఆటగాడిగా మారిపోయాడు. కెప్టెన్‌గా కూడా టీమ్‌ని ముందుండి నడిపించాడు. ఢిల్లీ తరఫున దేశవాళీ క్రికెట్‌లోనూ దాదాపు ఎనిమిది సీజన్లు ఆడిన ఉన్ముక్త్.. ఆ టీమ్‌కి కెప్టెన్‌గా కూడా పనిచేశాడు. కానీ 2017 విజయ్ హజారే ట్రోఫీ ముంగిట అతనిపై వేటు పడగా.. ఆ తర్వాత 2019లో అతను ఉత్తరాఖండ్‌ టీమ్‌కి మారాడు. 
 
మళ్లీ మనసు మార్చుకుని ఢిల్లీ జట్టులోకి వచ్చేశాడు. అయితే 2020-21 సీజన్‌లో మాత్రం అతనికి ఢిల్లీ తుది జట్టులో చోటు దక్కలేదు. అలానే 2011 నుంచి ఐపీఎల్‌లో ఆడుతున్న ఉన్ముక్త్.. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ టీమ్‌కి ప్రాతినిథ్యం వహించాడు. ఇన్నేళ్లలో కేవలం 21 మ్యాచ్‌లాడి 300 పరుగులు చేశాడు.