ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 మే 2024 (15:49 IST)

చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోనీని అంటిపెట్టుకుంటుందా? లేదా?

MS Dhoni
చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం మహేంద్ర సింగ్ ధోనీని అంటిపెట్టుకుంటుందా లేదా అన్నది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం లేకపోలేదు. 2024 ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కథ ముగిసింది. ఈ సీజన్‌లో సీఎస్కే జట్టు ఇప్పటికే ఇంటిబాట పట్టింది. అయితే ఇప్పుడు అందరి దృష్టి ఆ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనీపై పడింది. ధోనీ వచ్చే సీజన్ ఆడడంటూ వార్తలు వస్తున్నాయి. కానీ, రిటైర్మెంట్‌పై ధోనీ ఇంకా స్పందించలేదు. 
 
శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో మ్యాచ్ అనంతరం ధోనీ రిటైర్మెంట్ గురించి ఏదైనా అప్‌డేట్ ఉంటుందని క్రికెట్ అభిమానులు అనుకున్నారు. కానీ, అలాంటిదేమీ జరగలేదు. మహేంద్రుడు తన వీడ్కోలు గురించి ఎక్కడా బయటపెట్టలేదు. తాజాగా ఇదే విషయమై చెన్నె జట్టు యాజమాన్యం స్పందించింది. 'ధోనీ రిటైర్మెంట్ గురించి చెన్నై జట్టులో ఎవరికీ చెప్పలేదు. ఈ విషయంలో కాస్త సమయం తీసుకుంటాడు అనుకుంటున్నాం. అతడు ఓ నిర్ణయానికి వస్తే ఖచ్చితంగా యాజమాన్యంతో చెప్తాడు' అని వెల్లడించాయి.
 
ఇకపోతే, ఈ సీజన్‌లో కీపింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ ధోనీ రాణించాడు. కొన్ని మ్యాచుల్లోనైతే పాత ధోనీని కూడా గుర్తు చేశాడు. ఈ సీజన్‌లో ధోనీ ప్రదర్శన అతని వద్ద ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని గుర్తు చేసింది కూడా. 42 ఏళ్ల అతను సీఎస్కే తరపున అన్ని లీగ్ మ్యాచ్‌లలో ఆడాడు. 53.67 సగటు, 220.5 స్ట్రైక్ రేటుతో 161 పరుగులు చేశాడు.
 
ఇక ముంబై ఇండియన్స్ (ఎంఐ), ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)పై ధోనీ అద్భుతమైన ఔట్‌లు అతని పాత రోజులను అభిమానులకు గుర్తు చేశాయి. కాగా, రాబోయే ఐపీఎల్ మెగా వేలం ధోనీ భవిష్యత్తును నిర్ణయించనుంది. ఎందుకంటే ఈసారి ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల రిటెన్షన్‌పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో.. సీఎస్కే మహీని అంటిపెట్టుకుంటుందా? లేదా? అనేది తెలియదు.