ఐసీసీ వరల్డ్ కప్ : ఇంగ్లండ్ ఆరంభం అదిరింది.. సఫారీలు చిత్తు
క్రికెట్ ప్రపంచ ఆరంభం అదిరింది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ టాప్ లేపింది. టైటిల్ ఫేవరేట్ జట్లలో ఒకటైన సఫారీలను చిత్తుచేసింది. తద్వారా వరల్డ్ కప్ పోటీలను ఘనంగా ప్రారంభించింది.
ఐసీసీ వరల్డ్ కప్ పోటీల్లోభాగంగా, గురువారం జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ - సౌతాఫ్రికా జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ఇందులో ఇంగ్లండ్ జట్టు 104 పరుగులు భారీ ఆధిక్యంతో సఫారీలను చిత్తుచేసింది.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 311 పరుగుల భారీ స్కోరు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లు పేలవమైన బౌలింగ్ కారణంగా ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్స్ పరుగుల వరద పారించారు.
ఆ జట్టు ఆటగాళ్లలో నలుగురు అర్థ సెంచరీలు బాదారు. జాసన్ రూట్ 54, జో రూట్ 51, ఇయాన్ మోర్గాన్ 57, బెన్ స్టోక్స్ 89 చొప్పున పరుగులు రాబట్టడంతో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు తీయగా, తాహిర్, కిసో రబడలు తలా రెండేసి వికెట్లు తీశారు.
ఆ తర్వాత 312 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు 39.5 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఆ జట్టులో క్వింటన్ డికాక్ 68, డుసెన్ 50 చొప్పున పరుగులు చేయగా, మిగిలిన బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు. ఫలితంగా 104 పరుగుల తేడాతో ఓడిపోయింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో రాణించిన బెన్ స్టోక్స్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.