గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (08:57 IST)

మద్యంమత్తులో మహిళతో అసభ్య ప్రవర్తన... దుస్తులు విప్పి చితకబాదిన స్థానికులు...

crime
మద్యమత్తులో ఓ వ్యక్తి ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె శరీర భాగాలను తాకాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు కొందరు ఆ కామాంధుడుని పట్టుకుని చితకబాదారు. దుస్తులు విప్పి అర్థనగ్నంగా చేశారు. బెంగళూరు శివారులోని కాల్కరే గ్రామంలో ఈ ఘటన జరిగింది. ధర్వాడ్‌‍కు  చెందిన బాధితుడు రవికుమార్ రెండేళ్లుగా కాల్కరే సమీపంలోని ఓ హోటల్లో కుక్‌గా పనిచేస్తున్నాడు.
 
రాత్రి 10 గంటల సమయంలో ఓ యువతి (20) పాలు కొనేందుకు రోడ్డుపైకి వచ్చింది. ఆమెను చూసిన రవికుమార్ అసభ్యంగా ప్రవర్తిస్తూ శరీరాన్ని అనుచితంగా తాకాడు. దీంతో ఆమె భయంతో కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పరిగెత్తుకొచ్చి నిందితుడిని పట్టుకున్నారు. దాదాపు 12 మంది కలిసి అతడిపై దాడి చేస్తుండగా బాధిత మహిళ అక్కడి నుంచి జారుకుంది. 
 
నిందితుడిని పట్టుకున్న స్థానికులు అతడి ధోతీని విప్పించి తొడలు, ఇతర శరీర భాగాలపై దారుణంగా దాడిచేశారు. అనంతరం ఓ ఆటోలో నిందితుడిని తీసుకెళ్తుండగా విషయం తెలుసుకున్న పోలీసులు వారి చెర నుంచి బాధితుడిని రక్షించారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు. బాధితుడిపై ఉద్దేశపూర్వకంగా దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
 
నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేశామని, మిగతా వారిని కూడా పట్టుకుంటామని తెలిపారు. బాధితురాలిని కలిసి వివరాలు సేకరించామని, అయితే, ఆమె ఫిర్యాదు చేసేందుకు నిరాకరించిందన్నారు. నిందితుడు అసభ్యంగా ప్రవర్తించిన సమయంలో అతను, అతనిపై దాడికి పాల్పడిన వారు మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.