సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Updated : శనివారం, 18 జనవరి 2020 (19:30 IST)

పవన్ కళ్యాణ్ బిజెపితో దోస్తీ... ఎవరికి నష్టం? (video)

చరిష్మాతో ఓట్లు సంపాదించుకోలేమని చాలామంది సినీనటులు రాజకీయాల్లోకి వచ్చి నిరూపించారు. మొదటగా మెగాస్టార్ చిరంజీవి ఆయన గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇక రెండవది ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం జనసేన పార్టీతో ప్రజల్లోకి వెళుతున్న పవన్ కళ్యాణ్ తాజాగా తీసుకున్న నిర్ణయం ఎపి రాజకీయాల్లో చారిత్రాత్మకమన్న ఒక ప్రచారం జరుగుతోంది.
 
ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ బిజెపితో జతకట్టడం ఆ పార్టీకే నష్టమన్న ప్రచారాన్ని వైసిపి నేతలు చెబుతున్నారు. బిజెపి కేంద్రంలో చక్రం తిప్పుతోంది. ఆ పార్టీలో కనీసం కొంతమంది నేతలైనా జనాల్లో తిరుగుతున్నారు. ఆ పార్టీకి అంతోఇంతో పేరన్నా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఆ పార్టీలో ఎప్పుడూ సింగిల్. ఇక నాదెండ్ల మనోహర్ అంటారా ఆయన తప్ప ఇంకెవరూ పెద్దగా చెప్పుకునే నాయకులు లేరు.
 
పవన్ కళ్యాణ్‌ను చూసేందుకు వచ్చే వారిలో ఎక్కువమంది యువతే ఉన్నారు. వారందరూ ఓట్లేస్తారన్న నమ్మకం లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఇదంతా తేలిపోయింది. జనసేన పార్టీ ప్రస్తుతం వెనక్కి వెళ్ళిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకు కారణం ఉన్న ఒక్క ఎమ్మెల్యే కాస్త వైసిపి వైపు చూడడం.. జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తడం.
 
దీంతో వైసిపి ఇదే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తోంది. పవన్ కళ్యాణ్ వల్ల బిజెపికే నష్టమని.. స్థానిక సంస్ధల ఎన్నికలు కాదు.. ప్రధాన ఎన్నికల్లోను ఈ రెండు పార్టీలు గెలవవంటున్నారు వైసిపి నేతలు. అయితే వైసిపి విమర్సలను జనసేన అధినేతతో పాటు బిజెపి నేతలు అస్సలు పట్టించుకోవడం లేదు. 
 
కానీ విశ్లేషకుల అంచనా మాత్రం దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలనుకుంటున్న బిజెపి ఖచ్చితంగా అదే దిశగా వెళుతుందని.. అందులో భాగంగానే జనసేనతో పొత్తు పెట్టుకుందని.. రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బిజెపి వ్యూహాలు కదిపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో జనసేన కలవడం జనసేన పార్టీ నాయకులు స్వాగతిస్తున్నారు. కానీ టిడిపి మాత్రం ప్రస్తుతం సైలెంట్‌గా ఉంటోంది. మరి జనసేన-భాజపా పొత్తుతో లాభపడేది ఎవరన్నది మున్ముందు తేలనుంది.