మంగళవారం, 13 జనవరి 2026
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : గురువారం, 28 ఏప్రియల్ 2016 (15:59 IST)

పలు రకాల అనారోగ్య సమస్యలకు గృహ వైద్యంతో చెక్!

కొన్నిరకాల అనారోగ్య సమస్యలను ఇంట్లో ఉండే ఆహర పదార్థాలతోనే నయం చేసుకోవచ్చు. ఈ రకమైన గృహ వైద్యం గురించి తెలుసుకుంటే తరచూ ఎదుర్కొనే ఇబ్బందులను కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు వస్తున్న మందులకి, చేస్తున్న చికిత్సలకి ప్రత్యామ్నాయంగా ఈ చిట్కాలెంతగానో ఉపయోగపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
డయేరియా సమస్య ఉన్నవారు యాపిల్‌ను తురిమి దాని రంగు మారిన తర్వాత నెమ్మదిగా తినాలి. డయేరియాకి ఎప్పటి నుంచో ఉన్న పరిష్కారం నేరేడుపండ్లు. నేరేడుపండ్ల జామ్‌ని ప్రతి 3 గంటలకోసారి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. 
 
అజీర్ణం వల్ల గ్యాస్ సమస్య మొదలవుతుంది. ఉపశమనానికి అల్లం లేదా సోపుగింజలు వాడిన టీ తాగాలి. మోషన్‌ సిక్‌నేస్ సమస్య పోవాలంటే ఒక గ్లాసు మంచి నీటిలో అరస్పూన్ అల్లంపొడిని కలిపి తాగాలి. మోషన్‌ సిక్‌నెస్‌కి పిప్పర్మెంట్ ఆయిల్ కొన్ని చుక్కలను అరస్పూన్ పంచదారకి కలుపుకుని తినాలి. పిప్పరమెంట్ వాడిన టీ తాగవచ్చు. 
 
మామిడి, బొప్పాయి, ఫైనాపిల్, కివి పండ్లు, వీటిని తింటే ఫలితముంటుంది. పొట్టలో ఎంత ఇబ్బందిగా ఉన్నా కొన్ని పండ్లలోని ఎంజైముల వల్ల తగ్గిపోతుంది. వెక్కిళ్ళు సమస్య ఉన్నప్పుడు ఓ కప్పు నీళ్ళలో చెంచాడు మెంతులువేసి మరగ కాచిన నీటిని తాగితే తగ్గిపోతుంది. కాల్షియం అధికంగా ఉన్న పెంటాసిడ్ మాత్రలు రెండు మూడు తిన్నాకూడా వెంటనే వెక్కిళ్ళు పోతాయి. 
 
చిన్న చిన్న గాయాలకు ఐస్ ముక్కలను లేదా బాగా చల్లగా వున్న వేటినైనా గాయాలు, బెణుకులు, దెబ్బలు, నొప్పులకి గురైన శరీర భాగంపై కాసేపు ఉంచితే ఉపశమనం కలుగుతుంది. గోరువెచ్చని నీళ్ళుపోసిన గిన్నెలో తురిమిన ఉల్లిపాయ, బంగాళాదుంపల్ని వేసి నొప్పి పెడుతున్న చేతిని లేదా పాదాన్ని ఆ నీళ్ళలో కాసేపు ఉంచాలి. అలా ఉంచితే నొప్పి మటుమాయం.