శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఎంజీ
Last Modified: మంగళవారం, 16 నవంబరు 2021 (23:18 IST)

"మధుమేహం రాకుండా ముందే.... మేల్కొందాం"!

షుగర్‌ వ్యాధిని ఆధునిక యుగపు మహమ్మారిగా భావించవచ్చు. అత్యంత వేగంగా పరుగెడుతున్న కాలంతో పాటే అనివార్యంగా జీవనశైలిలో చోటుచేసుకుంటున్న మార్పులే షుగర్‌ వ్యాధికి అసలు కారణం. మౌలికంగా ఇది జీవన శైలి సమస్య. కాబట్టి మధుమేహాన్ని నియంత్రించడం మన చేతుల్లో పనిగానే భావించాలి!
 
 
"ఎందుకొస్తుంది"?
సాధారణంగా, క్లోమగ్రంధిలోని బీటా కణాలు ఇన్సులిన్‌ను సక్రమంగా స్రవించకపోవడం, లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మధుమేహం తలెత్తుతుంది. ఎవరిలోనైనా, ఇన్సులిన్‌ సరిగా పనిచేయకపోవడాన్ని ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ అంటారు.అధిక బరువు, స్థూలకాయం, పొట్టలో చేరిన కొవ్వులే దీనికి ప్రధాన కారణం. కొందరిలో ఇన్సులిన్‌ బాగానే ఉత్పత్తి అయినా, దాన్ని వినియోగించుకునే సామర్థ్యం (ఇన్సులిన్‌ సెన్సిటివిటీ) తగ్గిపోతుంది. ఇది కూడా మధుమేహానికి మూలమవుతుంది. అయితే బరువు తగ్గడం, క్రమం తప్పని వ్యాయామాలతో ఇన్పులిన్‌ సెన్సిటివిటీని పెంచుకోవచ్చు. కానీ, అత్యధికులు ఈ విషయంలో అశ్రద్ధగానే ఉంటున్నారు.
 
"ప్రీ - డయాబెటిస్‌ అంటే"...
ఇది మధుమేహానికి పూర్వదశ. రక్తంలో చక్కెర స్థాయి 140 నుంచి 199 మి.గ్రా. లకు చేరడాన్ని ‘ఇంపెయిర్డ్‌ గ్లూకోజ్‌ టాలరెన్స్‌’ లేదా‘ ప్రీ డయాబెటీస్‌’ అంటారు.
 
రక్తంలో చక్కెర స్థాయి 200 మి. గ్రాములు లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటే దాన్ని ‘టైప్‌ -2 షుగర్‌ వ్యాధిగా పేర్కొంటారు. ప్రీ- డయాబెటీస్‌ని బోర్డర్‌ లైన్‌ డయాబెటి్‌స్‌గానూ పేర్కొంటారు.. అయితే, ప్రీ- డయాబెటిస్‌ దశలో ఉన్నవాళ్లందరూ కచ్ఛితంగా టైప్‌-2 మధుమేహ వ్చాధిగ్రస్థులుగా మారతారని చెప్పలేం. కాకపోతే, రక్తంలో చక్కెర సాధారణ స్థాయిలో ఉన్నవారితో పోలిస్తే, ‘ప్రీ- డయాబెటీస్‌’ తో ఉన్నవాళ్లకు మధుమేహం సంక్రమించే అవకాశాలు 5 నుంచి 15 రెట్లు ఎక్కువ. భారతీయ వైద్య పరిశోధనా సంస్థ (ఐసిఎంఆర్‌) ప్రకారం మనదేశంలో ‘ప్రీ- డయాబెటిస్‌’తో ఉన్నవాళ్ల సంఖ్య 7 కోట్ల 72 లక్షలు.
 
 
"ఏమిటా కారణాలు"?
అధిక బరువు, స్థూలకాయం, శరీర శ్రమలేని జీవన విధానం, అధిక రక్తపోటు, రక్తంలో కొలెస్ట్రాల్‌ పెరుగుదల, రక్తసంబంధీకుల్లో టైప్‌-2 మధుమేహం ఉండడం, 4 కిలోలు అంతకన్నా ఎక్కువ బరువు ఉన్న బిడ్డలకు జన్మనిచ్చిన మాతృమూర్తులూ ప్రీ-డయాబెటిస్‌ బారిన పడే అవకాశాలు ఎక్కువ. బరువు తగ్గడం, వ్యాయామం చేయడం వంటివి చేయకపోతే, ప్రీ-డయాబెటిస్‌తో ఉన్నవాళ్లల్లో 15 నుంచి 30 శాతం మంది మధుమేహ వ్యాధిగ్రస్థులుగా మారే ప్రమాదం ఉంది.
 
"నివారించలేమా"?
కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా టైప్‌-2 షుగర్‌ వ్యాధి రాకుండా నివారించవచ్చని అనేక అధ్యయనాలు నిర్థారించాయి.


అలాంటి జాగ్రత్తల్లో.....
జీవన శైలిని మార్చుకోవడంతో పాటు, మెట్‌ ఫార్మిన్‌, ఎకార్బోజ్‌ లాంటి మాత్రల్ని తీసుకోవడం ముఖ్యమైనవి.
ఇంజెక్షన్లలో... ఇన్సులిన్‌లు, ఇన్సులిన్‌ ఎనలాగ్‌లు, జి. ఎల్‌. పి- 1 ఎగోనిస్టులు వాడటం.
 
"కొత్త రకం ఇన్సులిన్‌లు, ఇంజెక్షన్లు"....
కొత్త రకం ఇన్సులిన్‌లను, ‘ఇన్సులిన్‌ ఎనలాగ్స్‌’ అని కూడా అంటారు. ఇవి జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ పద్ధతుల్లో తయారైనవి. కాబట్టి వీటిని ‘ డిజైనర్‌ ఇన్సులిన్స్‌’ అని కూడా అంటారు. ఇన్సులిన్‌ ఎనలాగ్‌లతో ఒనగూడే ప్రయోజనాలు అనేకం. 
 
వాటిల్లో"....
ఎనలాగ్‌లు రక్తంలోని చక్కెర స్జాయిని సమర్థంగా నియంత్రిస్తాయి. అలాగని చక్కెర అత్యల్ప స్థాయికి పడిపోయేలా చేయవు. భోజనానికి అరగంట ముందు ఇంజెక్షన్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. మధ్య మధ్యలో అల్పాహారం తీసుకోవాల్సిన పని లేదు.
 
ఇన్సులిన్‌ ఎనలాగ్స్‌తో బరువు పెరగడం గానీ, ఇతర దుష్ప్రభావాలు గానీ ఏమీ ఉండవు. ఇన్సులిన్‌ ఎనలాగ్‌లతో పాటు మార్కెట్‌లో పలురకాల కొత్త ఇతర ఇంజెక్షన్లు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సగటున రెండు, మూడు నెలల చక్కెర స్థాయి ఆధారంగా చేసే, హెచ్‌.బి.ఏ.1 సి పరీక్ష ద్వారా కూడా ప్రీ- డయాబెటిస్‌ ని గుర్తించవచ్చు. ప్రీ- డయాబెటిస్‌లో హెచ్‌.బి.ఏ.1.సి స్థాయి 5.7 నుంచి 6.4 దాకా ఉంటుంది.
 
 
"పదిశాతం యువతరమే"!
ప్రపంచ వ్యాప్తంగా షుగర్‌ పేషంట్ల సంఖ్య, 17 కోట్ల 4 లక్షలకు చేరుకుంది. మన దేశంలో ప్రస్తుతం వీరి సంఖ్య 7 కోట్లుంది. 2030 నాటికి వీరి సంఖ్య 10 కోట్ల 12 లక్షలకు చేరుకుంటుందని అంతర్జాతీయ మధుమేహ వ్యాధి సమాఖ్య (ఐ.డి.ఎఫ్‌) అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. సమీప భవిష్యత్తులో మనదేశం షుగర్‌ వ్యాధికి రాజధానిగా మారబోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే, మన దేశీయుల్లో 10 ఏళ్లు ముందుగానే షుగర్‌ మొదలవుతోంది. బాధాకరమైన విషయం ఏమిటంటే, ప్రస్తుతం మన దేశంలోని 10 శాతం యువత ఈ వ్యాధితో బాధపడుతోంది.
 
'మధుమేహం రాకుండా".....
క్రమం తప్పని వ్యాయామం వల్ల శరీర కణజాలంలోని ఇన్సులిన్‌ గ్రాహకాల సెన్సిటివిటీ పెరుగుతుంది. దీనివల్ల ఇన్సులిన్‌ను గ్రహించలేని ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ సమస్య తగ్గుతుంది.
 
అందువల్ల రోజుకు ఒక అరగంట పాటు వాకింగ్‌, స్విమ్మింగ్‌, సైక్లింగ్‌ వంటి వ్యాయామాలు విధిగా చేయాలి.
 
తక్కువ కేలరీలు ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటూ, బరువు తగ్గించుకోవాలి. దీనివల్ల గ్లూకోజ్‌ టాలరెన్స్‌ పెరుగుతుంది.
 
క్రమం తప్పకుండా వైద్య చికిత్సలు తీసుకోవడంతో పాటు కొలెస్ట్రాల్‌ నియంత్రణకు తోడ్పడే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పొగతాగడం వంటివి పూర్తిగా మానే యాలి. సమస్య నిరంతరం షుగర్‌ నియంత్రణ విషయంలో శ్రద్ధ వహిస్తే, మధుమేహం ఉన్నా, వాటి దుష్పరిణామాలకు గురికాకుండా జీవితాంతం హాయిగానే జీవించవచ్చు.
 
 
'- డాక్టర్‌ ఎస్‌. ఏ. రవూఫ్‌'
ఎన్‌. ఆర్‌. డయబెటిక్‌ కేర్‌ సెంటర్‌
ఓల్డ్‌ క్లబ్‌ రోడ్డు, గుంటూరు