శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్ రేవిళ్ల
Last Modified: సోమవారం, 18 మార్చి 2019 (18:17 IST)

థైరాయిడ్ ఎందుకు వస్తుంది? నివారణ మార్గాలేమిటి?

ఇటీవల కాలంలో బి.పి, షుగర్ మాదిరిగానే థైరాయిడ్‌తో బాధపడేవారు కూడా చాలామంది ఉన్నారు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా చాలామందికి వచ్చే జబ్బు ఇది. దీనికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారంలో పోషకాల లోపం లేదా హార్మోన్లు సరిగ్గా పనిచేయకపోవడం. మన ఆహార అలవాట్లలో సరైన మార్పులు చేసుకుని మందులు సరిగ్గా తీసుకుంటే దీని నుండి బయటపడవచ్చు.
 
థైరాయిడ్‌లో రెండు రకాలు ఉన్నాయి. సాధారణంగా థైరాయిడ్ గ్రంథి మెడ భాగంలో ఉంటుంది. అది థైరాక్సిన్ అనే హార్మోన్‌ని విడుదల చేస్తుంది. ఆ హార్మోన్ శరీరంలో జీవక్రియ రేటును నియంత్రిస్తుంది.
 
థైరాయిడ్ వ్యాధిలో మొదటిది హైపో థైరాయిడ్. దీని వలన శరీరానికి తగినంత మోతాదులో థైరాయిడ్ హార్మోన్లు అందవు, ఫలితంగా జీవక్రియ రేటు తగ్గిపోతుంది. మీరు తిన్న ఆహారం అంత త్వరగా ఎనర్జీగా మారదు. దానివల్ల బరువు ఎక్కువగా పెరిగిపోతారు. దానితోపాటు అలసట నీరసం తోడవుతాయి. ఈ సమస్యతో బాధపడేవారు తీసుకోవాల్సిన ఆహారం ఏమిటో చూద్దాం.
 
అవిసె గింజలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ పని తీరును మెరుగుపరుస్తాయి. థైరాక్సిన్‌ని కావల్సినంత మోతాదులో మాత్రమే ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. నిత్యం అవిసె గింజలను, లేదా పొడిని ఏదో ఒక రూపంలో ఒక టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకోవడం చాలా మంచిది.
 
ఇక రెండవది హైపర్ థైరాయిడ్. థైరాక్సిన్ ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల ఈ సమస్యతో బాధపడేవారు బరువు తగ్గిపోతారు. నీరసంగా ఉండటం, నిద్రపట్టకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 
 
దీనిని నివారించడానికి పాటించాల్సిన జాగ్రత్తలు చూద్దాం.
మనం రోజూ తీసుకునే ఉప్పులో అయోడిన్ ఉంటుంది. అయితే ఉప్పును అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకుంటే థైరాక్సిన్‌ను ఎక్కువ ఉత్పత్తి చేసి హైపర్ థైరాయిడ్ కలిగేలా చేస్తుంది. ఈ సమస్య ఉన్నవారు రోజుకి 5 గ్రాముల ఉప్పుని మాత్రమే తీసుకోవాలి. వాల్నట్స్‌లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. అది థైరాయిడ్ గ్రంధి పనితీరును మెరుగుపరుస్తుంది. దీంతో థైరాక్సిన్ అవసరమున్నంత మేర శరీరానికి అంది థైరాయిడ్ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. థైరాయిడ్ సమస్య ఉన్నవారు అల్లాన్ని తమ ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది. నిత్యం ఉదయాన్నే పరగడుపున ఒక స్పూన్ అల్లం రసం తేనెతో సేవించాలి. దీంతో థైరాయిడ్ గ్రంధి పనితీరు మెరుగుపడుతుంది.
 
హైఫో థైరాయిడ్ ఉన్నవారు పచ్చి కూరగాయలను తక్కువగా తినాలి. పచ్చి కూరగాయలలో ఉండే జియోట్రెజిన్ మంచిది కాదు. క్యాబేజి, కాలీప్లవర్, బ్రకోలి, ముల్లంగి లాంటివి ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. వీరు పాలతో చేసిన పదార్థాలు కూడా తక్కువగా తీసుకోవాలి. థైరాయిడ్‌తో బాధపడేవారు మంచి ఆహారం తీసుకోవడం, మందులు వాడటంతోపాటు వ్యాయామం కూడా చేస్తే మంచి ఫలితాలను చూడవచ్చు.