సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. యోగాసనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (20:54 IST)

surya namaskar: ప్రతిరోజూ 108 సూర్య నమస్కారాలు చేయాలా?

చాలామంది ప్రతిరోజూ 108 సూర్య నమస్కారాలు ఎందుకు పాటిస్తారు? అనే ప్రశ్న చాలామందిలో వుంటుంది. ఇలా రోజూ సూర్య నమస్కారం చేయడం వల్ల ఆ సమయంలో ఉత్పన్నమయ్యే అంతర్గత వేడి ప్రక్షాళన, నిర్విషీకరణ జరుగుతుందని నమ్ముతారు. 108 సూర్య నమస్కారాలు పాటించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సూర్య నమస్కారాలు శరీరాన్ని వేడి చేస్తాయి, శక్తిని పైకి వచ్చేలా సక్రియం చేస్తాయి. సూర్య నమస్కారాలను ఏ వయస్సులోని వారైనా వేయవచ్చు. దీని వలన శారీరకంగానూ, మానసికంగానూ ఉపయోగంగా ఉంటుంది.
 
ఆసనం ఎలా వేయాలి?
1. నిలబడిన స్థితిలో కాళ్ళను పరస్పరం దగ్గరకు తీసుకు రావాలి. భుజాలను చక్కగా పైకి తీసుకు రావాలి. తలకుపైకి తీసుకు వచ్చిన అరచేతులను కలపాలి. ఆలాగే ముఖం ఎదుటకు తీసుకువచ్చి నమస్కారం చేసే స్థితికి రావాలి. కలిపిన చేతులు ఛాతీ వద్ద ఉండేలా చూసుకోవాలి.
 
2. గాలిపీల్చుకుంటూ భుజాలను పైకి తీసుకురావాలి. చెవులను తాకుతూ ఉండాలి. మెల్లగా చేతులను వెనకవైపుకు తీసుకురావాలి. వీలైనంతగా తలను వెనక్కు వంచాలి. 
 
3. మెల్లగా గాలి వదులుతూ ముందుకు వంగాలి. చేతులను సమాంతరంగా ఉంచుతూ నేలను తాకాలి. ఈ సమయంలో తల మోకాలిని తాకుతూ ఉండేంతవరకూ తీసుకురావాలి. ఈ స్థితిలో కొన్నిసెకనులు అలాగే ఉండాలి. దీనినే పాద పశ్చిమోత్తాసనం అంటారు. 
 
4. గాలి పీల్చుతూ కుడికాలును వెనక్కు తీసుకురావాలి. వీలైనంత వెనక్కు ఉండేలా చూడాలి. ఈ స్థితిలో తలపైకెత్తాలి. కొన్ని సెకనలు ఈ స్థితిలో ఉండాలి. 
 
5. మెల్లగా గాలి వదులుతూ అదే విధంగా ఎడమ కాలిని వెనక్కు తీసుకురావాలి. పాదాలు రెండూ పక్కపక్కన ఉండేలా చూడాలి. భజాలు చక్కగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు శరీరం బాణం విల్లు ఆకారంలో ఉంటుంది.
 
6. మెల్లగా గాలి వదులుతూ శరీరాన్ని నేలను తాకించాలి. మోకాళ్లు, అరచేతులు, ఛాతీ, నుదురు నేలను తాకుతూ ఉండాలి. అప్పుడు గాలిని మెల్లగా వదిలివేయాలి. 
 
7. మళ్లీ మెల్లగా గాలి పీల్చుకుంటూ తలను వీలైనంత వెనుకకు వంచాలి. దాదాపు నడుము వరకూ శరీరాన్ని వెనక్కు వంచాలి. దీనిని భుజంగాసనం అంటారు. 
 
8. మెల్లగా గాలి వదులుతూ తుంటి, తలను భుజాలతో సమాంతరంగా ఉండేలా పైకి తీసుకురావాలి. ఇప్పుడు మళ్ళీ పైభాగానికి విల్లులా కనిపిస్తుంది. 
 
9. మెల్లగా గాలి పీల్చుకుంటూ కుడికాలిని ముందుకు తీసుకురావాలి. చేతులు సమాంతరంగా ఉంచుతూ తలపైకెత్తాలి. మెల్లగా గాలిబయటకు వదులుతూ కుడికాలును కూడా ఇదేవిధంగా ముందుకు తీసుకురావాలి. పాదాలు, చేతులను సమాంతరంగా తీసుకువస్తూ తల మోకాళ్ళను తాకేలా చూడాలి. 
 
10. మెల్లగా గాలి వదులుతూ భుజాలను పైకి లేపాలి. మెల్లగా తల వెనుకకు వంచాలి. తిరిగి నమస్కార స్థితిలోకి రావాలి. తరువాత మొదటి స్థితికి చేరుకోవాలి. ఇంతటితో ఒక రౌండ్ పూర్తవుతుంది. తిరిగి ఈ ఆసనాన్ని మళ్ళీ వేయాలి. 
 
జాగ్రత్తలు 
తుంటి జారినవారు, వెన్ను నొప్పి ఉన్నవారు ఈ ఆసనాలు వేయకపోవడం మంచిది. వారు ఒకవేళ ఆసనాన్ని వేయాలనుకుంటే వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది. 
 
ఉపయోగాలు 
జీర్ణావయవాలు ఉత్తేజితమవుతాయి. చాలా చురుకుగా పనిచేస్తాయి. ఫలితంగా జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. చర్మంలో ఉన్న అసమానతలు, సమస్యలు తొలగిపోతాయి. చర్మం తాజాదనాన్ని సంతరించుకుంటుంది. వెన్నెముకకు మరింత మేలు జరుగుతుంది.