ఈ చెట్టు ఆకుతో అధిక బరువును కంట్రోల్ చేయవచ్చు...
ఇటీవలి కాలంలో అధిక బరువు సమస్యతో బాధపడే వారు ఎక్కువవుతున్నారు. ఇలాంటి వారు ఆ సమస్యను వదిలించుకునే చిట్కాలు వున్నాయి. మీ పెరట్లో జామచెట్టు గనుక ఉంటే ఇక మీరు ఎలాగోలా కాస్త బరువు తగ్గడమేకాదు.
చక్కగా మీ శరీరంలోని చెడు కొలెస్టరాల్‌ను కూడా తరిమేయవచ్చు. ఎలాగంటే గుప్పెడు జామ ఆకులను కడిగి, కొద్దిగా నీటిని మరిగించి అందులో వేసి చల్లార్చితే జామాకుల టీ తయారవుతుంది. ఈ టీని తాగడం వల్ల బోలెడు మంచి ఫలితాలు ఉంటాయట.
ఈ టీ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది, ఇంకా శరీరంలోని చెడు కొలెస్టరాల్‌ను కరిగించే శక్తి ఉంది, ఫలితంగా బరువు తగ్గుతారు.
జామాకుల టీని తాగితే శ్వాస సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి. జామాకులను శుభ్రంగా కడిగి వాటిని నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గుతాయి, నోటిపూత కూడా తగ్గుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు నొప్పులు, వాపులను నివారించే గుణాన్ని కలిగివుంటాయి. కాబట్టి కాస్త వగరుగా ఉన్నా నెలకు ఒకసారైనా జామాకుల టీని తాగి చూడండి.