మంగళవారం, 14 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 అక్టోబరు 2021 (08:47 IST)

ఈక్వెడార్‌ జైల్లో శవాల కుప్పలు - ఎమర్జెన్సీని విధింపు

ఈక్వెడార్‌ దేశంలోని గాయక్విల్‌ నగరంలోని లిటోరల్‌ జైల్లో ఘర్షణ చెలరేగింది. అయితే, ఈ ఘర్షణ అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 116కు పెరిగింది. దీంతో పరిస్థితి చేయిదాటిపోవడంతో అక్కడ జైళ్ళలో అత్యయికస్థితిని విధించింది. 
 
కాగా, లిటోరల్ జైల్లో రెండు ముఠాల సభ్యులు కారాగారంలో తుపాకులు, కత్తులు, బాంబులతో మంగళవారం పరస్పరం దాడులు చేసుకొని బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో మరో 80 మందికి గాయాలయ్యాయి. ఈక్వెడార్‌ చరిత్రలో జైళ్లలో చోటుచేసుకున్న అతిపెద్ద మారణహోమం ఇదేకావడం గమనార్హం. 
 
తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఈక్వెడార్‌ వ్యాప్తంగా జైళ్లలో అత్యయిక స్థితిని విధిస్తున్నట్లు దేశాధ్యక్షుడు గిలెర్మో లసో ప్రకటించారు. వాటిలో అదనపు పోలీసు బలగాలను మోహరించనున్నట్లు వెల్లడించారు. 
 
ఏరులై పారిన రక్తం, తెగిపడిన శరీర భాగాలు, పేలుళ్ల విధ్వంసంతో లిటోరల్‌ జైల్లో పరిస్థితులు భయానకంగా కనిపించాయి. ఒక్కోచోట మృతదేహాలు కుప్పలుగా పడివున్నాయి. మృతుల్లో ఐదుగురి తలలు మొండేల నుంచి వేరయ్యాయి. తరచూ ఘర్షణలు తలెత్తుతుండటంతో ఈ ఏడాది జులైలో కూడా ఈక్వెడార్‌ కారాగారాల్లో ఎమర్జెన్సీని విధించారు.