శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 మార్చి 2023 (09:57 IST)

ఐక్యరాజ్య సమితికి చేరిన నిత్యానంద లీలలు.. యూఎన్‌లో నిత్యానంద ప్రతినిధి ప్రసంగం

vijayapriya nityananda
మన దేశంలో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోయిన నిత్యానంద స్వామి లీలలు ఇపుడు ఐక్యరాజ్య సమితి చేరాయి. ఈయన ప్రతినిధి ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించడం ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. తన ఆశ్రమంలో పనిచేసే అమ్మాయిలను అత్యాచారం చేసినట్టు ఆరోపణలు రావడంతో  నిత్యానంద స్వామిపై కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆయన దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం ఆయన కైలాస అనే దీవిని కొనుగోలు చేసి.. కైలాసం పేరుతో ఓ దేశాన్ని స్థాపించినట్టు ప్రకటించారు. తమ దేశానికి జెండా, అజెండా, రిజర్వు బ్యాంకు, సొంత కరెన్సీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పాస్‌పోర్టు కూడా ఉందని ప్రకటించారు. 
 
ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ నవ్వుకున్నారు. పైగా, అదో రకమైన ప్రచారంగా కొట్టిపారేశారు. అయితే, ఐక్యరాజ్య సమితిలో కైలాస దేశం తరపున ఓ ప్రతినిధి ప్రసంగించడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. తాజా పరిణామాన్ని బట్టి కైలాస దేశం అనేది ఉత్తుది కాదని, నిత్యానంద స్వామి నిజంగానే ఓ దేశానికి అధినేత అని నిరూపణ అయింది.
 
తాజాగా జెనీవా వేదికగా ఐక్యరాజ్య సమితి సమావేశం జరిగింది. ఇందులో కైలాస దేశం తరపున విజయప్రియ నిత్యానంద, ఈఎన్ కుమార్‌లో ప్రతినిధులుగా హాజరయ్యారు. ఇందులో విజయప్రియ నిత్యానంద తనను తాను పరిచయం చేసుకుంటూ కైలాస దేశ శాశ్వత ప్రతినిధిగా చెప్పారు. ఆ విధంగానే ఆమె ఐక్యరాజ్య సమితిలో ప్రసంగం చేశారు. 
 
ఈ సందర్భంగా ఆమె తన ప్రసంగంలో తొలుత కైలాస దేశ విశిష్టతను తెలిపారు. కైలస దేశం కేవలం హిందువులకోసమే ఏర్పడిన మొట్టమొదటి సార్వభౌమ దేశంగా అభివర్ణించారు. తమ అధినేత పేరు నిత్యానంద పరమశివం అని వెల్లడించారు. నిత్యానంద పరమశివం పరమావధి హిందూ మత పునరుజ్జీవం అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తమ దేశ అధిపతిని భారత్ ఆరోపిస్తుందంటూ ఐరాస వేదికగా ఆరోపించారు. అందువల్ల ఆయనకు రక్షణ కల్పించాలని ఆమె కోరారు.