బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 18 సెప్టెంబరు 2022 (13:59 IST)

మనశ్శాంతి కోసం 53 పెళ్ళిళ్లు చేసుకున్న సౌదీ అరేబియా వాసి

marriage
సాధారణంగా ఒక పెళ్లికే మనశ్శాంతి లేకుండా పోతుందని అనేక మంది పురుషులు వాపోతుంటారు. కానీ, సౌదీ అరేబియాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం మనశ్సాంతి కోసం ఏకంగా 53 పెళ్లిళ్లు చేసుకున్నాడు. పైగా, అతని వయస్సు ఇపుడు 63 యేళ్లు. ఈయన 43 యేళ్లకే 53 పెళ్ళిళ్లు చేసుకున్నారు. చివరకు ఈ వ వివాహాల వల్ల తనకు మనశ్సాంతి ఉండదనే నిజాన్ని గ్రహించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సౌదీ అరేబియాకు చెందిన అబూ అబ్దుల్లా (63) అనే వ్యక్తి ఈ శతాబ్దపు బహుభార్యావేత్త అనే బిరుదును సంపాదించుకున్నాడు. అతను తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వివాహాల గురించి మాట్లాడాడు. 'నేను 43 ఏళ్లలో 53 మంది మహిళలను వివాహం చేసుకున్నాను. 20 సంవత్సరాల వయసులో నేను మొదటి వివాహం చేసుకున్నాను. ఆమె నాకంటే ఆరేళ్లు పెద్దది. ఆ వివాహం తర్వాత నేను మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకోలేదు. 
 
ఎందుకంటే అప్పుడు నేను సంతోషంగానే ఉన్నాను. పిల్లలను కూడా పొందాను. అయితే ఆ తర్వాత మా మధ్య విభేదాలు మొదలయ్యాయి. 23 సంవత్సరాల వయస్సులో మళ్లీ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నా. 
 
నా నిర్ణయాన్ని మొదటి భార్యకు తెలియజేసి రెండో పెళ్లి చేసుకున్నా. ఆ తర్వాత ఆ ఇద్దరూ తమలో తాము గొడవపడుతూ నన్ను ఇబ్బంది పెట్టారు. అప్పుడు ఆ ఇద్దరికీ విడాకులు ఇచ్చి మూడు, నాలుగు వివాహాలు చేసుకున్నట్టు చెప్పాడు. 
 
'నన్ను సంతోషపెట్టగల స్త్రీ కోసం వెతుకుతున్న క్రమంలో నేను అనేక వివాహాలు చేసుకున్నాను. నా జీవితంలో అతి చిన్న వివాహం కేవలం ఒక రాత్రి మాత్రమే కొనసాగింది. నా భార్యలలో చాలా మంది సౌదీ మహిళలే. కొందరు విదేశీ మహిళలు కూడా ఉన్నారు. 
 
విదేశీ వ్యాపార పర్యటనల సమయంలో వారిని వివాహం చేసుకున్నా. నిజానికి ప్రపంచంలోని ప్రతి పురుషుడు ఒకే స్త్రీతో కలకాలం ఉండాలని కోరుకుంటాడ'ని అబ్దుల్లా చెప్పాడు. తాను ఇప్పుడు ఒక మహిళతోనే జీవిస్తున్నాని, మరో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఇక తనకు లేదని అబ్దుల్లా చెప్పాడు.