దేశాన్ని ముక్కలు కానివ్వను : నరేంద్ర మోడీ
తాను జీవించి ఉండగా దేశాన్ని ముక్కలు కానివ్వనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పైగా, జమ్మూ, బారాముల్లాలో జరిగిన తొలి విడత ఎన్నికల్లో అధిక సంఖ్యలో పాల్గొని ప్రజాస్వామ్య గొప్పతనాన్ని చాటారని చెప్పుకొచ్చారు. దీంతో ఉగ్రనేతలు, అవకాశవాదులకు ఓటర్లు తగిన విధంగా బుద్ధి చెప్పారన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జమ్మూ కాశ్మీర్‌లోని కథువాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు.
2014 కంటే ఇప్పుడు బీజేపీ వైపు గాలి మరింత బలంగా వీస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ కంటే మూడింతలు అధిక సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 'జలియన్‌వాలా బాగ్ ఉదంతంపై.. దేశం మొత్తం అమరులకు నివాళులర్పిస్తే కాంగ్రెస్ మాత్రం ఈ కార్యక్రమాన్ని రాజకీయం చేసిందని ఆరోపించారు.
ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హాజరైతే.. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మాత్రం అక్కడకి రాలేదు. కాంగ్రెస్ వారసుడితో వెళ్లి నివాళులర్పించిన ఆయన ప్రభుత్వ కార్యక్రమానికి మాత్రం రాలేకపోయారు. కాంగ్రెస్ కుటుంబానికి భక్తిని చాటడంలో నిమగ్నులయ్యారు. మెరుపు దాడుల పదం వింటే కాంగ్రెస్ ఎందుకు ఉలికిపడుతోందని ప్రశ్నించారు.
ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు దేశాన్ని రెండుగా చీల్చడానికి చూస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో తాను అలా జరగనివ్వనని తేల్చి చెప్పారు. అబ్దుల్లా, ముఫ్తీల కుటుంబాలు మూడు తరాల జమ్మూ కాశ్మీర్ ప్రజల జీవితాన్ని నాశనం చేశాయని మండిపడ్డారు. వారిని సాగనంపితేనే జమ్మూకాశ్మీర్‌కు చక్కటి భవిష్యత్తు ఉంటుందని పిలుపునిచ్చారు. ఆ ఇరు పార్టీల వాళ్లు తనపై విమర్శలు మాత్రమే చేయగలరని, దేశాన్ని విడదీయలేరని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.