శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By మోహన్
Last Updated : శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (11:49 IST)

పొరపాటున బీజేపీకి ఓటు వేసి... వేలును నరుక్కున్న ఓటరు...

భారతదేశ వ్యాప్తంగా ఈనెల 18వ తేదీన గురువారం రెండో దశ సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహాయిస్తే ప్రతీచోట కూడా ఓటర్లు క్యూలైన్లలో ఓపిగ్గా నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే అత్యధిక లోక్‌సభ స్థానాలను కలిగి ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఓటర్ చేసిన పని ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్‌డీలు కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. అధికార బీజేపీ మాత్రం ఒంటరిగా పోటీ చేస్తోంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన పవన్ కుమార్(25) అనే ఓటరు పోలింగ్ బూత్‌లో పొరపాటున బీఎస్పీకి ఓటు వేయబోయి బీజేపీకి ఓటు వేశాడు. దీంతో తాను అనుకున్న అభ్యర్థికి కాకుండా పొరపాటున వేరొక అభ్యర్థికి ఓటువేయడాన్ని జీర్ణించుకోలేకపోయిన పవన్ కుమార్ తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపంగా తన వేలును తానే నరికేసుకున్నాడు.
 
పవన్ కుమార్ ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షర్ నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడ సిట్టింగ్ ఎంపీ బీజేపీ అభ్యర్థి బోలా సింగ్‌కు, కూటమి బలపరిచిన అభ్యర్థి యోగేష్ వర్మకు మధ్య పోటీ జరుగుతోంది. అయితే వర్మకు ఓటు వేయాలని భావించిన పవన్ కుమార్ బోలాసింగ్‌కు ఓటు వేయడంతో తన వేలును నరుక్కున్నాడు. ఈ ఘటన తర్వాత పవన్ కుమార్ ఒక వీడియో విడుదల చేశాడు. అది ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. కాగా ఉత్తరప్రదేశ్‌లో 8 స్థానాలలో రెండో దశలో ఎన్నికల పోలింగ్ జరిగింది.