మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 8 సెప్టెంబరు 2019 (17:39 IST)

ప్రధాని మోడీ వంద రోజులనపై కాంగ్రెస్ సెటైర్లు

కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ప్రధాని మోడీ సారథ్యంలోన ఈ బీజేపీ సర్కారు పాలనపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. వందరోజుల పాలనలో దౌర్జన్యం, గందరగోళం, అరాచకం తప్ప సాధించిందేమీ లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. మూక దాడులు, రాజ్యాంగ ఉల్లంఘన వంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వం దేశ సమగ్రతను తీవ్రంగా దెబ్బతీసిందని మండిపడింది. ఈ మేరకు ఆదివారం తన అధికార ట్విటర్‌ ఖాతా ద్వారా ఓ వీడియోను విడుదల చేసింది.
 
'బీజేపీ వంద రోజుల పాలనలో ప్రజలపై దౌర్జన్యం, అరాచకం పాలన గందరగోళం తప్ప మరేమీ లేదు. బీజేపీ ఎన్నికల వాగ్ధానమైన సబ్‌కాసాత్‌ సబ్‌కా వికాస్‌ కేవలం నినాదంగానే మిగిలిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. బ్యాంకులు దీవాలా తీసే పరిస్థితుల్లో ఉన్నాయి. నిరుద్యోగ సమస్య తీవ్రంగా వెంటాడుతోంది. రైతులు ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేకపోయింది. 
 
జమ్మూ కాశ్మీర్ రెండుగా విభజించి అక్కడి ప్రజలను మరింత దూరం చేసింది. వివాదాస్పద ఎన్‌ఆర్సీతో దేశ ప్రజలను బీజేపీ పాలకులు విదేశీయులుగా గుర్తిస్తున్నారు. రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడుతూ.. కేంద్రమాజీ మంత్రి చిదంబరంను తప్పుడు కేసుల్లో ఇరికించారు. ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా సమాచార శాఖ, ఉపా వంటి చట్టాలను సవరించారు' అంటూ సుదీర్ఘ వీడియోను పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.