లాక్ డౌన్ కొనసాగితే ఫ్యాక్టరీల్లో 12 గంటల పని?
లాక్ డౌన్ ను కొనసాగించాలని నిర్ణయించిన పక్షంలో 1948 నాటి ఫ్యాక్టరీల చట్టానికి సవరణలు తేవాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుత చట్టం ప్రకారం, కార్మికులతో 8 గంటల షిఫ్ట్ లో మాత్రమే పనిచేయించాలి. రోజుకు మూడు షిఫ్ట్ లను నిర్వహించాలి.
లాక్ డౌన్ నిబంధనల నేపథ్యంలో, రోజుకు రెండు షిఫ్ట లను 12 గంటల చొప్పున నిర్వహిస్తూ, ఫ్యాక్టరీలను తిరిగి నడిపించుకునే వెసులుబాటును కల్పించాలని కేంద్రం యోచిస్తోంది.
రోజుకు 12 గంటల రెండు షిఫ్ట్ ల చొప్పున వారంలో ఆరు రోజుల పాటు పరిశ్రమలు నడిపించేలా చట్ట సవరణకు అవకాశాలు ఉన్నాయని కేంద్ర అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం వారంలో 48 గంటలకు మించి ఎవరినీ పని చేయించరాదన్న నిబంధనలు ఉన్నా, కొన్ని అత్యవసర పరిస్థితుల్లో పని గంటలను వారానికి 72 గంటలు పొడిగించ వచ్చని కూడా నిబంధనలు ఉన్నాయని వారు గుర్తు చేశారు.
లాక్ డౌన్ కారణంగా పలు అత్యవసర వస్తు ఉత్పత్తుల కంపెనీల్లో పని సక్రమంగా జరగడం లేదు. ఔషధాల సరఫరా కూడా అంతంతమాత్రంగానే సాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఫ్యాక్టరీల చట్టానికి తాత్కాలిక సవరణ చేయడమే ఉత్తమమని 11 మంది సీనియర్ అధికారుల సాధికార కమిటీ కేంద్రానికి సిఫార్సులు పంపింది.
ఇదే సమయంలో కార్మికుల కొరత లేకుండా చూసుకోవాల్సి వుందని, కాంట్రాక్టు వర్కర్లు లభించే పరిస్థితి లేకపోవడంతో, ఉన్నవారితోనే ఎక్కువ సమయం పనిచేయించుకునే సౌలభ్యం కల్పించాల్సి వుందని పేర్కొంది. ఈ మేరకు కార్మికులకు అదనపు వేతనం కూడా లభిస్తుందని కమిటీ కేంద్రానికి తమ సిఫార్సులు పంపింది.
లాక్ డౌన్ పరిస్థితులను మదింపు వేసేందుకు కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ కార్యదర్శి పవన్ అగర్వాల్, డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ కార్యదర్శి గురు ప్రసాద్ మోహపాత్రాల నేతృత్వంలో ఓ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, సమావేశమైన ఈ కమిటీ, ఫ్యాక్టరీల చట్టానికి సవరణలను సూచించింది.