శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2020 (09:18 IST)

కరోనా ఎఫెక్ట్​: 30% పెరిగిన డేటా వినియోగం

ఇదివరకంటే సెలవులు దొరికితే అష్టాచమ్మా, క్యారమ్​బోర్డ్​ వంటి ఆటలు ఆడుతూ గంటల తరబడి టైంపాస్​ చేసేవారు. కానీ, ఇప్పుడు కాలం మారింది. దేశవ్యాప్త లాక్​డౌన్ కొనసాగుతున్న వేళ.. ఇంటికే పరిమితమైన జనమంతా నెట్టింట కాలక్షేపాన్ని వెతుక్కుంటున్నారు.

స్మార్ట్​ ఫోన్​లలో సినిమాలు, ట్యాబుల్లో టీవీ సీరియళ్లు వీక్షిస్తూ ఆనందంగా గడిపేస్తున్నారు.​ దీంతో ఆన్‌లైన్‌ వీడియో సంస్థలు పండగ చేసుకుంటున్నాయి. సరికొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఆన్‌లైన్‌ వీడియోలకు డిమాండ్‌ భారీగా పెరిగింది.

షికార్లు, థియేటర్లలో సినిమా ప్రదర్శనలపై నిషేధంతో నెట్టింట్లో సినిమా, సీరియళ్లు, కచేరీలతో ప్రజలు కాలక్షేపం చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు అందుబాటులోని సినిమాలు, టీవీషోలను చూస్తూ గడుపుతున్నారు.

మరోవైపు ఆన్‌లైన్‌ వీడియో సంస్థలు కొత్త చందాదారుల్ని ఆకట్టుకునేందుకు స్వల్పకాలానికి ఉచిత ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. గత వారం రోజుల్లోనే వీడియో డిమాండ్‌ 30శాతం వరకు పెరిగింది. సినిమా థియేటర్లు మూసివేయడంతో ఆన్‌లైన్‌ టికెట్లు విక్రయించే సంస్థలు ఆన్‌లైన్‌ లైవ్‌ కచేరీలు నిర్వహిస్తున్నాయి.

కొత్త సినిమాలు, టీవీషోలకు ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌, ఈటీవీ-విన్‌, జీ, యూట్యూబ్‌ తదితర సంస్థలు ప్రాచుర్యం పొందాయి. కొత్త సినిమాలు థియేటర్లలో విడుదలైన కొద్దిరోజుల్లోనే ఆన్‌లైన్‌ వీడియో ప్లాట్‌ఫామ్‌కు వస్తున్నాయి.

యువతలో ఈ వీడియో యాప్‌లకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. ఈ-టీవీ విన్‌లో సీరియళ్లు, షోలు, సినిమాలు ఇప్పటికే ఉచితంగా లభిస్తున్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌ తదితర సంస్థలు నెలవారీ, వార్షికప్లాన్‌లు తీసుకుంటే వీక్షించేందుకు అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లలో ఈ యాప్‌లు సాధారణమయ్యాయి. స్మార్ట్‌ టీవీ, మొబైల్‌, ట్యాబ్‌ల్లో ఎక్కడైనా రిజిస్టర్‌ చేసి వీక్షించవచ్చు.