శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 జూన్ 2022 (19:39 IST)

రాష్ట్రపతి ఎన్నికలకు షెడ్యూల్ విడుదల - జూలై 18న పోలింగ్

president bhavan
దేశ ప్రథమ పౌరుడు (రాష్ట్రపతి) ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్‌ విడుదల చేసింది. దీని ప్రకారం ఈ నెల 15వ తేదీన ఎన్నికలకు నోటిఫికేషన్‌ను అధికారికంగా జారీ చేస్తారు. ఆ తర్వాత 29వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జూలై 2వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరణకు గడువు ఇస్తారు. జూలై 18 తేదీన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్, 21వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతారు. ఈ మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.
 
ప్రస్తుతం రాష్ట్రపతిగా ఉన్న బీహార్ రాష్ట్రానికి చెందిన రాంనాథ్ కోవింద్ పదవీకాలం వచ్చే నెల 24వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో జూలై 25వ తేదీలోగా కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాల్సివుంది. దీనికి అనుగుణంగానే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు రాజీవ్ కుమార్ తెలిపారు. నామినేషన్ల పర్వం, ఓట్ల లెక్కింపు ఢిల్లీలోనే జరుగుతుంది. పోలింగ్ మాత్రం పార్లమెంటుతో పాటు ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఆవరణాల్లో నిర్వహిస్తారు.