గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Modified: శుక్రవారం, 28 జూన్ 2019 (15:45 IST)

ఆశీర్వదిస్తే మీకు రూ. 1000, వృద్ధ మహిళలను ఆటోలో ఎక్కించుకునీ...

మోసాలకు, దారుణాలకు అంతేలేకుండా పోతోంది. కొత్తకొత్త స్కెచ్‌లతో మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆటో నడుపుకుంటూ పొట్టపోసుకునే ఓ ఆటో డ్రైవర్ తనకు వస్తున్న సంపాదనతో తృప్తి చెందక అడ్డదారి తొక్కాడు. ఫలితంగా జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... చెన్నైలోని తురైపాక్కం, నీలాంగరై చుట్టుప్రక్కల ప్రాంతాల్లో వృద్ధురాళ్లను లక్ష్యంగా చేసుకుని దోపిడీలు జరుగుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ దోపిడీలు చేస్తున్నవాడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. సీసీ కెమేరాల్లో నమోదైన దృశ్యాలను పరిశీలించిన పోలీసులకు ఓ ఆటోలో వృద్ధురాళ్లను ఎక్కించుకుని వెళ్తున్న డ్రైవర్ పైన అనుమానం వచ్చింది. 
 
అతడి ఆచూకి వెతికి పట్టుకున్నారు. దాంతో అసలు సంగతి బయటపడింది. ఇతడు రోజూ ఉదయం వేళ ఇళ్ల ముందు, దుకాణాల ముందు కూర్చుని వుండే వృద్ధ మహిళలపై ఫోకస్ పెడ్తాడు. వారితో మంచిగా మాట్లాడుతూ... తనకు తెలిసిన ధనికుల ఇంటిలో గృహ ప్రవేశం జరుగుతుందనీ, మీరు అక్కడికి వచ్చి ఆశీర్వదిస్తే రూ. 1000 ఇస్తారని నమ్మబలుకుతాడు. ఆశీర్వదిస్తే రూ. 1000 వస్తుందనగానే ఆశగా వృద్ధ మహిళలు ఆటో ఎక్కేసేవారు. దాంతో కొంతదూరం వెళ్లాక ఆటోని నిర్మానుష్య ప్రాంతానికి తరలించి కత్తి బైటకు తీసి బెదిరించి నగలు, డబ్బు దోచుకుని పరారయ్యేవాడు. 
 
ఇలా ఎంతోమంది వృద్ధ మహిళలను మోసం చేసినట్లు సమాచారం అందింది. అతడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండుకి పంపారు.