గురువారం, 3 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 2 జులై 2025 (14:14 IST)

Rabies: తను రక్షించిన కుక్కపిల్ల కాటుకే గిలగిలలాడుతూ మృతి చెందిన గోల్డ్ మెడలిస్ట్ కబడ్డీ ఆటగాడు (video)

Brijesh Solanki dies after contracting rabies
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని బులంద్‌షహర్‌లో రాష్ట్ర స్థాయి కబడ్డీ ఆటగాడు, రాష్ట్ర ఛాంపియన్‌షిప్‌లలో బంగారు పతక విజేత అయిన 22 ఏళ్ల బ్రిజేష్ సోలంకి రేబిస్ వ్యాధితో దాదాపు రెండు నెలల తర్వాత మరణించాడు. మురుగు కుంటలో చిక్కుకుని ప్రాణాలతో పోరాడుతున్న ఓ కుక్కపిల్లను అతడు రక్షించే క్రమంలో దాని కాటుకు గురయ్యాడు. ఏముందిలే చిన్నకుక్కపిల్ల కాటు తనను ఏం చేస్తుంది అని అశ్రద్ధ చేసాడు. యాంటీ-రేబిస్ వ్యాక్సిన్ తీసుకోలేదు. దీనితో అతని మరణానికి కొన్ని రోజుల ముందు లక్షణాలు కనిపించాయి.
 
బ్రిజేష్ మరణానికి ముందు అతని ప్రవర్తన, అతడి ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు చూపించే కలతపెట్టే వీడియో ఆదివారం ఆన్‌లైన్‌లో కనిపించింది. ఈ వీడియో చూసినవారంతా అతడి అవస్థను చూసి కన్నీటిపర్యంతమవుతూ సందేశాలు పోస్ట్ చేసారు. గణాంకాల ప్రకారం, భారతదేశం ప్రపంచానికి రేబిస్ రాజధానిగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా మరణాలలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ రేబిస్ మరణాలు ఇక్కడే చోటుచేసుకుంటున్నాయి. అయినప్పటికీ ఈ విషయం ప్రజల చర్చలోకి ప్రవేశించడం లేదు. జంతు హక్కుల సంఘాలు కూడా స్టెరిలైజేషన్, టీకాలు వేయడం వంటి మానవీయ పరిష్కారాలను చర్చించడానికి అభ్యంతరం చెప్పవు.
 
ఈ ఏడాది వీధి కుక్కల కాటు కారణంగా మరణించిన భారతీయుల సంఖ్య 21, 000గా వున్నట్లు ఓ నివేదిక ద్వారా తెలుస్తోంది. వాస్తవానికి వెలుగులోకి వస్తున్న మరణాల కంటే వెలుగుచూడని మరణాల సంఖ్య ఇంకా ఎక్కువేనని అంటున్నారు. ఇంట్లో పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లులు కాటుకి గురై చనిపోతున్నవారి సంఖ్య కూడా తక్కువేమీ వుండటంలేదు. ఈ నేపథ్యంలో ర్యాబిస్ వ్యాధి గురించి, జంతువుల కాటు విషయంలో ప్రజలు అప్రమత్తంగా వుండాల్సిన ఆవశ్యక వుంది.