మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (20:21 IST)

కరోనా సోకిన రోగి విచ్చలవిడిగా తిరిగితే 406 మందికి సంక్రమిస్తుంది...

ప్రపంచంతో పాటు మన దేశాన్ని కూడా కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా అనేక మంది మృత్యువాతపడుతున్నారు. లక్షలాది మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. అలాంటి వైరస్‌ను వ్యాప్తిని కట్టడి చేయడంలో ప్రభుత్వాలకు ఓ సవాల్‌గా మారింది. 
 
అయితే, ఓ వ్యక్తికి కరోనా సోకినప్పుడు ఆ వైరస్ తాలూకు లక్షణాలు బయటపడేసరికి 14 రోజుల సమయం పడుతుంది. ఈ లోపే ఆ వ్యక్తి మరికొందరికి వైరస్ అంటించే అవకాశాలు ఉండడంతో కరోనా వేగంగా విస్తరిస్తోంది. దీనిపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ అధ్యయన చేసింది. 
 
ఈ అధ్యయన ఫలితాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఈ అధ్యయనం గురించి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఓ కరోనా పాజిటివ్ వ్యక్తి లాక్‌డౌన్ నిబంధనలు పాటించకుండా సమాజంలో తిరిగినట్టయితే 30 రోజుల్లో 406 మందికి వ్యాధి సంక్రమింపచేయగలడని ఆ అధ్యయనంలో పేర్కొన్నారు. 
 
దీన్ని వైద్య పరిభాషలో 'ఆర్ నాట్' (R-0)గా భావిస్తారు. అయితే, సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోగలిగితే ఆ వ్యక్తి ఇతరులకు వైరస్ అంటించే శాతాన్ని గణనీయంగా తగ్గించవచ్చని వివరించారు. నివారణ చర్యలు తీసుకుంటే అతడి ద్వారా వైరస్ బారినపడేవాళ్ల సంఖ్య సగటున కేవలం 2 నుంచి 2.5 వరకు ఉంటుందని తెలిపారు.