శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 మార్చి 2023 (14:52 IST)

నవమి వేడుకల్లో అపశృతి - మెట్లబావిలో పడిన 25 మంది భక్తులు

Lord Rama
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి జరిగింది. స్థానికంగా ఓ మెట్ల బావి పైకప్పు కూలిపోవడంతో అందులో భక్తులు పడిపోయారు. ఈ ఘటన పటేల్‌ నగర్‌ ప్రాంతంలో జరిగింది. 
 
స్థానిక మహదేవ్‌ జులేలాల్‌ ఆలయంలో రామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. స్థలాభావం కారణంగా కొందరు ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్లబావిపై కూర్చున్నారు. అయితే దురదృష్టవశాత్తూ ఆ బావి పైకప్పు కూలిపోయింది. 
 
దీంతో దాదాపు 25 మంది భక్తులు అందులో పడిపోయారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. నిచ్చెన సాయంతో భక్తులను బయటకు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటివరకు 10మందిని కాపాడి వారిని ఆసుపత్రికి తరలించారు. బావి లోతు 50 అడుగుల పైనే ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
 
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. స్థానిక వేణుగోపాలస్వామి ఆలయంలో రాములవారి కల్యాణోత్సవం నిర్వహించారు. 
 
విద్యుదాఘాతం కారణంగా అక్కడ ఏర్పాటు చేసిన చలువ పందిరిలో మంటలు చెలరేగాయి. దీంతో భక్తులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదు. భక్తులతో కలిసి స్థానికులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.