శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 18 మార్చి 2023 (09:51 IST)

శ్రీవారి భక్తులకు శుభవార్త.. కాలినడకన చేరుకునే వారికి తీరనున్న కష్టాలు

venkateswara swamy
శ్రీవారి భక్తులకు శుభవార్త. మరీ ముఖ్యంగా కాననడకన ఏడు కొండలపైకి చేరుకునేవారికి కష్టాలు తీరనున్నాయి. కరోనా ఆంక్షల కారణంగా కాలినడకన వచ్చే భక్తులకు శ్రీవారి దర్శన టిక్కెట్లను నిలిపివేసిన విషయం తెల్సిందే. వీటిని తిరిగి పునరుద్ధరించాలని తితిదే అధికారులు భావిస్తున్నారు. 
 
త్వరలో శ్రీవారి మెట్ల మార్గం గుండా వెళ్లే భక్తులకి ఫ్రీ దర్శనం టికెట్లు ఇవ్వనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. గతంలో ఇదేవిషయాన్ని ప్రకటించిన టీటీడీ అధికారులు మరోసారి క్లారిటీ ఇచ్చారు.
 
శుక్రవారం రాజాంలో పర్యటించిన ఆయన దివ్య దర్శనం టికెట్లపై వివరణ ఇచ్చారు. త్వరలోనే తిరుమల కొండ పైకి నడిచి వెళ్లే భక్తులకు ఉచిత దర్శనం టికెట్స్ త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. నడక దారిలో వచ్చే అందరికీ కాకుండా.. ఎలాంటి టికెట్లు లేకుండా కొండపైకి వచ్చే వారికి మాత్రమే టికెట్లు ఇస్తామని తెలిపారు.
 
నాలుగంచెల విధానంలో భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని చెప్పారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. టీటీడీలో ప్రవేశ పెట్టిన ఫేస్‌ రికగ్నిషన్ టెక్నాలజీ విధానం ద్వారా భక్తులకు సేవలు సులభంగా అందుతున్నాయని వివరించారు. వేలాది మంది వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందుల కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
 
'కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఈనెల 21వ తేదీన నిర్వహిస్తాం. ఉదయం 11 గంటలకు సర్వదర్శనం ప్రారంభంమవుతుంది. ఈ సందర్భంగా అష్టదళపాదపద్మారాధన సేవను రద్దు చేస్తున్నాం. దీంతోపాటు తిరుమలలో ఈ నెల 30వ తేదీన శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం జరగనుంది. 30వ తేదీన సాయంత్రం 6.30 గంటలకు శ్రీవారు.. హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ నెల 31వ తేదీన శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తున్నాం' అని ధర్మారెడ్డి వివరించారు.
 
తితిదే ఆధీనంలో 60కి పైగా ఆలయాలు ఉన్నాయని… వాటి సరసన రాజాం ఆలయం కూడా చేరిందని ఈవో ధర్మారెడ్డి అన్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త జీఎంఆర్ కోరిక మేరకు రాజాం ఆలయాన్ని టీటీడీలో విలీనం చేసినట్లు వెల్లడించారు. తిరుపతి లడ్డును రాజాం ఆలయంలో కూడా అందుబాటులో ఉంచుతామని చెప్పారు.