సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 28 జులై 2019 (12:23 IST)

నాపైనే అవిశ్వాస తీర్మానమా? 14 రెబెల్స్‌పై అనర్హత వేటేసిన స్పీకర్

కర్నాటక రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. తిరుగుబాటు జెండా ఎగురవేసిన 17 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై కర్నాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేశారు. తనపై అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వాలని ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప నిర్ణయించారు. ఈ అవిశ్వాస నోటీసును సోమవారం ఉదయం సభకు ఆయన అందజేయనున్నారు. దీంతో ఒక్క రోజు ముందు స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ - జేడీఎస్ సర్కారుకు మద్దతు ఉపసంహరించి బీజేపీకి మద్దతు ప్రకటించిన 17 మంది రెబెల్స్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు.
 
తొలుత ముగ్గురిపైన అనర్హత వేటు వేసిన స్పీకర్ రమేష్ కుమార్... ఆదివారం మరో 14 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. వీరిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు 14 మంది ఉండగా, జేడీఎస్‌కు చెందిన ముగ్గురు సభ్యులు ఉన్నారు. అనర్హత వేటు వేయడానికి కారణం లేకపోలేదు. రెబెల్స్ ఎమ్మెల్యేలు తిరిగి తమ రాజీనామాలను ఉపసంహరించుకుని యడియూరప్ప ప్రభుత్వంలో తిరిగి మంత్రిపదవులు చేపట్టకుండా ఉండేలా అనర్హత వేటు వేశారు. దీంతో కర్నాటక రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి. 
 
కాగా, ఇటీవల జరిగిన విశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి కుమార స్వామి సర్కారు కూలిపోయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యడియూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. కానీ మంత్రివర్గాన్ని విస్తరించలేదు. అయితే, సోమవారం స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం 14 మంది రెబెల్స్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం ఇపుడు సంచలనంగా మారింది.