శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 ఏప్రియల్ 2020 (13:17 IST)

లాక్‌డౌన్ ఎఫెక్టు.. వందల కిమీ నడక ... ఆకలితో అలమటించి శ్వాస విడిచిన అబల.. ఎక్కడ?

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. దీంతో పొట్ట చేతబట్టుకుని మరో ప్రాంతానికి వెళ్లిన వలస కూలీలు తిరిగి తమతమ ప్రాంతాలకు చేరుకునేందుకు రవాణా సౌకర్యాలు లేక అల్లాడిపోయారు. ఇలాంటివారిలో కొందరు ఎలాగైనా తమ సొంతూళ్లకు వెళ్లాలని భావించారు. అలా వందల కిలోమీటర్ల దూరంలో ఉండే తమ సొంతూళ్ళకు కాలి నడకన పయనమయ్యారు. 
 
కానీ, ఆకలిని భరించలేక మార్గమధ్యంలోనే తుదిశ్వాసవిడిచారు. ఇలాంటి సంఘటనలు గత కొన్ని రోజులుగా వింటున్నాం. ఇపుడు ఇలాంటి విషాదకర సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ అబల ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 230 కిలోమీటర్లు నడిచి నీరసించి పోయింది. ఒకవైపు నీరసం... తాగడానికి గుక్కెడు నీళ్లు లేవు.. తినడానికి పిడికెడు మెతుకులు లేవు.. చివరకు ఎర్రటి ఎండ.. కాలినడక ఆమె ప్రాణాల్ని బలి తీసుకున్నాయి. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నాటక రాయచూరు జిల్లా సింధనూరు పట్టణంలోని వెంకటేశ్వరనగర్‌కు చెందిన గంగమ్మ (27) దంపతులు.. బెంగళూరులోని కెంగేరి ఏరియాలో భవన నిర్మాణ రంగంలో కూలీలుగా పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌ అమలు చేయడంతో భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి. దీంతో కూలీలు తమ సొంతూర్లకు వెళ్లాలని కాంట్రాక్టర్‌ ఆదేశించారు. కూలీలకు పూట గడవడం కష్టంగా మారింది.
 
సింధనూరు పట్టణానికి చెందిన కూలీలు దిక్కుతోచని స్థితిలో మార్చి 30వ తేదీన తమ సొంతూరికి ట్రాక్టర్‌లో బయల్దేరారు. బెంగళూరు నుంచి తుమకూరు రాగానే పోలీసులు ట్రాక్టర్‌ను ఆపేశారు. చేసేదిమీ లేక తుమకూరు నుంచి కూలీలందరూ కాలినడకన బళ్లారికి బయల్దేరారు. తుమకూరు - బళ్లారి మధ్య సుమారు 230 కిలోమీటర్ల దూరం ఉంది. బళ్లారి సమీపం వరకు గంగమ్మతో పాటు మిగతా కూలీలు కాలినడకనే వచ్చారు. 
 
తుమకూరు - బళ్లారి మధ్యలో ఆ కూలీలకు ఎవరూ తిండి పెట్టలేదు. కనీసం నీరు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే కరోనా భయంతో. చివరకు ఏప్రిల్‌ 2వ తేదీన ఓ ట్రాక్టర్‌ను కిరాయి తీసుకుని బళ్లారికి రాగానే అక్కడున్న చెక్‌పోస్టు వద్ద పోలీసులు వారిని ఆపేశారు. అక్కడున్న ఓ పునరావాస కేంద్రంలో కూలీలు సేద తీరుతున్నారు. 
 
గంగమ్మ మాత్రం తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమెకు మూడు రోజుల పాటు నీరు, ఆహారం లేకపోయేసరికి తీవ్రంగా నీరసించింది. దీంతో భర్త సహాయంతో కూలీలు ఆమెను విమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చేరిన తర్వాత ఆమెకు ఆహారంతో పాటు పండ్ల రసం కూడా ఇచ్చారు. గంగమ్మకు ఇతర అనారోగ్య సమస్యలు ఉండడంతో చికిత్స పొందుతూనే ఆమె కన్నుమూసింది. నీరసం, కాలేయం, రక్తహీనత వల్లే గంగమ్మ మృతి చెందిందని వైద్యులు వెల్లడించారు.