లాక్‌డౌన్స్ రూల్స్ : మనుషులు పాటించడం లేదు - గజరాజులు ఫాలో అయ్యాయి!!
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశం యావత్తూ లాక్‌డౌన్‌లో ఉంది. దీంతో ప్రజలంతా వారివారి ఇళ్ళకే పరిమితమయ్యారు. అయితే, కొన్ని చోట్ల కొంతమంది ప్రజలు ఈ లాక్‌డౌన్ నిబంధనలను పట్టించుకోవడం లేదు. పాటించడం లేదు. ముఖ్యంగా, యువత తమకేంకాదులే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారిని పోలీసులు కట్టడి చేస్తున్నారు. ఎలాంటి కారణం లేకుండా రోడ్లపైకి వచ్చే వారిని పోలీసులు అడ్డుకుని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. అయినప్పటికీ పలు ప్రాంతాల్లో పోలీసులపై దాడులు చేస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో కొన్ని గజరాజాలు మాత్రం తమకు కూడా లాక్‌డౌన్ నియమం వర్తిస్తుంది అన్నట్టుగా నడుచుకున్నాయి. సాధారణంగా అటవీ ప్రాంతం నుంచి బాహ్యప్రపంచంలోకి వచ్చే ఏనుగులు.. మనుషులను చూస్తే వారిపై దాడికి దిగుతాయి. కానీ, ఈ ఏనుగులు మాత్రం అలా చేయలేదు. బుద్ధిగా వాటి దారిన అవి వెళ్లిపోయాయి.
ఈ అరుదైనదృశ్యం కర్నాటక రాష్టంలోని కొడగు జిల్లా మాల్దారే కూడలిలో కనిపించింది. ఈ జంక్షన్‌లో ఓ గజరాజుల గుంపు మాత్రం ఎలాంటి హల్‌చల్ చేయకుండా నిదానంగా వాటి దారిన అవి వెళ్లిపోయాయి. లాక్‌డౌన్ ఎఫెక్టుతో జనాలంతా ఇండ్లలో నుంచి బయటకు రాకపోవడంతో.. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
గజరాజాలు మనుషులను చూసి అప్పడపుడు గ్రామాల్లోకి చొరబడేవి.. కానీ ఈ సారి మాత్రం మనుషులెవరూ కనిపించకపోవడంతో.. మాకు కూడా లాక్‌డౌన్ రూల్స్ అమలులో ఉన్నాయి అన్నట్లు ఏనుగుల మంద ఇలా రోడ్డుపైకి వచ్చి అలా అడవిలోకి వెళ్లిపోయింది. ఓ ఫారెస్ట్ అధికారి వాటిని వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా, ఈ వీడియో ఇపుడు వైరల్ అయింది.