శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 18 జులై 2018 (14:29 IST)

శుక్రవారమే అవిశ్వాసం.. మోదీ సర్కారు రె ''ఢీ''..

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో సమావేశాలు ప్రారంభం కాగానే.. కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చింది. ఈ తీర్మానాన్ని స్పీకర్‌ కూడా ఆమ

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో సమావేశాలు ప్రారంభం కాగానే.. కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చింది. ఈ తీర్మానాన్ని స్పీకర్‌ కూడా ఆమోదించారు. దీంతో టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై కేంద్రం దిగివచ్చినట్లైంది. అంతేగాకుండా మోదీ సర్కారు అవిశ్వాసంపై చర్చకు రెడీ అయ్యింది. 
 
శుక్రవారం నాడు లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ చేపట్టనున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలిపారు. శుక్రవారం ప్రశ్నోత్తరాలను కూడా రద్దు చేసి, సాయంత్రం వరకు అవిశ్వాసంపై చర్చ జరపనున్నట్టు వెల్లడించింది. చర్చ సందర్భంగా ఏయే పార్టీకి ఎంత సమయం ఇవ్వాలనే విషయాన్ని స్పీకర్ ఖరారు చేయనున్నారు.
 
తమకు నాలుగు గంటల సమయం కావాలని టీడీపీ కోరింది. అయితే, రెండు గంటల సమయం ఇస్తామని, వెసులుబాటును బట్టి సమయాన్ని పెంచే ప్రయత్నం చేస్తామని స్పీకర్ వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా వుంటే సోమవారం నాడు విభజన చట్టంపై రాజ్యసభలో చర్చ సాగనుంది.
 
అంతకుముందు లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని తెదేపా ఎంపీ కేశినేని నాని ప్రవేశపెట్టారు. తెదేపా ఎంపీల అవిశ్వాస తీర్మానం అందిందని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రకటించి.. దాన్ని సభ ముందు ఉంచారు. తీర్మానంపై చర్చకు విపక్ష సభ్యులు మద్దతుగా నిలిచారు. 50 మందికిపైగా సభ్యులు మద్దతుగా లేచినిలబడటంతో స్పీకర్‌ అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించారు. చర్చ తేదీని శుక్రవారమని ప్రకటించారు.